Thursday, June 3, 2010

అవతారం

హైదరాబాద్, కె.పి.హెచ్.బి.కాలని. బస్టాండ్.
పగలు. పాన్ షాప్ దగ్గర, ఇద్దరు స్నేహితులు కబుర్లాడుతున్నారు. సిగరెట్లు పొగలొదులుతున్నాయి.
"ఇంకేటీ,సంగతులు?"
"అవతారం సార్ తెలుగు పూత్తిగా మర్సిపోయినాడంట?"
"కొంపతీసి ఆళ్ళబ్బాయి సుబ్బిగాడు అమెరికాలో సెటిలయిపోయాడేటి?"
"దానికీ దీనికీ సంబంధమేటేహే?"
"సంబంధమేటా?",(పెద్దగానవ్వు) "...తింగరినాకొడకా!"
"సెప్పరాదేటి?"
"మన కాలనీలో ఎంతమంది పోరగాళ్ళు అమెరికా ఎల్లలేదు! ఆళ్ళు ఎల్లంగానే, ఇక్కడ అమ్మాబాబులు ఎంతమంది తెలుగు మర్సిపోలేదు!"
"అవతారం సార్ ఏరెహె"
"ఓరెర్రి పప్పా! నీకన్నా సలీం గాడు నయంలాగుంది."
"ఆ కిరాయి కారోడా?"
"ఈ కాలని ముసలోళ్ళకి ఆడే కదేటి,డ్రయివింగులు నేర్పేది! వోరే తెల్సా? ఈ ముస్లోడికి ఒకప్పుడు సైకిలు తొక్కడం కూడా రాదు."
కోపంగా, "ఏ ముసలోడు?"
నోట్లోని సిగరెట్టు తీసి పళ్ళసందుల్లోంచి ఉమ్ముతూ, "నీయక్క, అవతారమెహె!"
పిడిగిలి బిగిస్తూ, "నాయాలా! మాటలు జాగత్తగా రానీయ్".
"నీకేటయిందిరా? ఓ తెగ పీలయిపోతన్నావ్?"
"ఆ సార్ మాకు తెలుగు పంతులు"
"ఎప్పుడూ?!"
"ఇస్కూల్లో"
"తెలుగు పంతులు, తెలుగు మర్సిపోతమేటిరోయ్!!"
"మరదే కదరా నేన్ సెప్పేది, ఎడ్డినాకొడకా!"

* * *

కాలనిలో ఓ ఇల్లు. రాత్రి.
బెడ్రూంలో మంచంపై భార్యకై ఎదురుచూస్తూ - చేతిలో కాలక్షేపం పత్రిక - శృంగార కధలో బొమ్మని చూస్తూ,కూనిరాగం...
"హే కాపుకొస్తే ...ఉహుహూ హుహూ...జాము కొస్తే....ఉహుహూ హుహూ...."
"విన్నారా?",డోర్ కి గడియ పెడుతూ, అంది భార్య.
"హేమిటి?" ( పళ్ళికిలుస్తూ)
"అవతారం గారు తెలుగు మర్చిపోయారట?"
"నీదాకా వచ్చిందా వార్తా?", విసుగ్గా అన్నాడు. "పనికిమాలిన సంగతులన్నీ దీనికే కావాలి" (స్వగతం)
భార్య - మంచం మీదకి వాలుతూ...
"ఇలా వారపత్రికలు తిరగేసే బదులు, ఏ జావా పుస్తకాలో చదివితే, మనమూ అమెరికాలో ఉండేవాళ్ళం"
భార్య కాళ్ళ మీద కాలు వేస్తూ...
"ఇంకా అమెరికా ఏమిటే పిచ్చిమొహమా! అక్కడి కంపెనీలు ఇక్కడికొస్తున్నాయి. అక్కడి పిజ్జాలు ఇక్కడ దొరుకుతున్నాయి", అన్నాడు.
"ఆ ఎప్పుడు తిండి గొడవే. ఇంకా కారు నడపడం రాదు. కనీసం పాస్ పోర్ట్ కూడా లేదు"
"ఈ రాత్రి కూడా వృధాయేనా, వాత్సాయనా! ...ఆ టైమొస్తే మనమూ వెళ్తాం".
"రేపు ఈవీధి ఆడవాళ్ళం వెళ్తున్నాం,"
"అమెరికాకే?"
"అంతసీన్ లేదులేండి. అవతారం గారి భార్యని పలకరించటానికి".
"అంతగా విషమించిందా?"
"బ్రెయిన్ స్కేనింగులూ గట్రా తీసారుట."
"భూతవైధ్యుణ్ణి పిలవాల్సింది."
"మీకు విషయం పూర్తిగా తెల్సినట్టులేదు. తెలుగు అనే భాష ఉన్నట్టే ఆయనకి గుర్తులేదట."
"గూబలమీద ఓరెండు పీకితే, 'అమ్మా' అని అరవడేమిటే?"
"మీకంతా వేళాకోళమే? పాపం,ఏదో కొత్తరకం జబ్బట."
"అయినా ఆయనకి మానేసి, ఆయన భార్యకి పలకరింపులేమిటి?"
"ఆయన్ని పలకరించాలంటే ముదనష్టపు ఆగ్లం రావాలి కదా! ఈ మధ్య జంతుజాలంతో కూడా ఆంగ్లమేనట"

* * *

కాలనిలో అవతారం గారిల్లు. రాత్రి.
పెరటి ప్రహారి - చెక్క ఫెన్సింగ్ దగ్గర - అవతారం గారి పెప్పుడు కుక్క లూసి. అటువైపు వెనకింటి వారి కుక్క డాలి.
"గంటనించి బాతాఖాని కొడుతున్నా... ఆళ్ళ సార్ గురించి ఒక్కముక్కా సెప్పదేటో!",డాలి మనసులో అనుకుంది. తనంతట తనే ఎందుకు అడగడం అని ఇంతసేపూ ఆగింది. చిన్నగా దగ్గి…
"పక్కవీధి పిల్లి సెంద్రిని, మీసార్ ఏదో అన్నాడంట?",అడిగింది డాలి.
"అదో గలీజుది! ఈ మనుషుల్లో ఉండే అవలచ్చనాలు కొన్ని దానికీ అబ్బినట్టున్నాయి... మా యజమాని గురించి ఏమైనా కూసిందా?"
"మొన్న దావతయి మీవంటింట్లో దూరితే, మీ సార్ ఏదో భాషలో అరుత్తానే ఉన్నాడంట. ఆ తిట్లు సంజవక బేజారెత్తిందట."
"ఇంకేం కూసిందా నంగనాచిది?"
"మీ ఇంట్లో ఇక ఎంగిలిపడనని వట్టేసుకుందట,అందరకి సెప్తా ఉంది. అవునే...మీ సార్ కి ఏదో జబ్బంట, నిజమేనా?", భయంగానే డాలి అడిగింది.
"మా ఇంటిపరువు తీయాలని సూత్తాందా...ఆ బజారు లంజ?", కోపంగా అరిచింది లూసి. కాసేపు మౌనంగా ఉండిపోయి, భారంగా నిట్టూర్చి...
"మా యజమాన్నేదో పట్టింది. ఏదో బెమల్లో ఉన్నోడిలా...అదే సొల్లు వాగుడు. వమెరికా అన్న ముక్కోటే తెలస్తా ఉండాది."
"రోజంతా టీవీలో అయ్యే సూత్తాడంట?"
"కిందటేడు వమెరికాలో ఎవరో పేరున్న పాటగాడు పోయాడంట,రెండు దినాలు కూడు తింటం బంద్ సేసిండు."
"మీ సారుకి అతని పాటలంటే అంతిష్టమా?"
"పాటలెప్పుడు ఇనలేదు".
"మరి తిండెందుకో మానేయడం?"
"అదో ఎర్రితనం."
"మొన్న వారం,మీ సారు పోయాడన్నట్టుగా, గొల్లుమన్నదెవరే?", ధైర్యం చేసి అడిగేసింది డాలి.
"ఈ సంగతి నీదాకా వచ్చిందా!", అని నొచ్చుకుంది లూసి. "మన తండ్రులు వేరైనా, ఓతల్లికి పుట్టిన వాల్లమని ఇయ్యన్నీ సెపుతున్నాను,ఎక్కడా వాగమాక!", అని లూసి చెప్పసాగింది…
"అగ్రహారం నుండి ఆయన ఇద్దరప్పలూ వచ్చి ఉన్నారులే. అవతారం గారు నిద్రలో ఏదో సణగతా ఉంటే,ఆ భాష అర్ధంగాక,`సంధి పేలాపన` అనుకుని కిందపడుకోబెట్టి,సెరోపక్కా కూకుని శోకన్నాలు మొదలెట్టారు. ఏదుపులకి మెలకువ వచ్చి,వారిని ఆపమని సెప్పటానికి పెయత్నింతే, ఆయన నోట్లోంచి ఒక్క తెలుగుముక్కా రాదాయే.", లూసి చెప్పటం ఆపి ముక్కు చీదింది.
"ఆయాల్టి నించి ఆయన తెలుగన్నది పూత్తిగా మర్సిపోనాడు. ఎంతలా గింజుకున్నా, అదేటి ఇంగిలిపీసంట,అన్నీ ఆ కూతలే వత్తన్నాయి..." అని కళ్ళల్లో నీరు ఉబుకుతోంటే, లూసి తల పక్కకి తిప్పుకుంది.
ఫెన్సింగ్లో తన ముఖాన్ని దూర్చి, బలవంతాన నవ్వాపుకుంటూ...
""మనయి తెలుగు పేర్లేటే?", ఆటపట్టించటాని కన్నట్టుగా అంది డాలి.
"ఈ మనుసుల్ని, శానా వాటికి మనం సెమించేయాలి!",నవ్వుతూ అంది లూసి.

1 comment:

శ్రీ said...

బాగుంది, కామెడీ పండింది.