Saturday, March 13, 2010

బిజీ జీవితం

బిజీబిజీ జీవితం
జీవితం గజీబిజీ
గజీబిజీ,రాజీరాజీ
రాజీపడ్డ జీవితం

రాజీపడ్డ జీవితం
జీవితం ఓపంజరం
పంజరంలో రెక్కలాడిస్తున్నగతం
గతాన్ని శిలువేసుకున్నజీవితం

గతాన్ని నెమరేస్తున్నజీవితం
జీవితాన్ని మోస్తున్న స్వగతం
స్వగతంలో కరుగుతున్న స్వప్నం
స్వప్నాలుడిగిన జీవితం

బిజీబిజీ జీవితం
రాజీపడ్డ జీవితం
గతాన్ని మేస్తున్నజీవితం
స్వప్నాలుడిగిన జీవితం

Thursday, March 11, 2010

నాడు - నేడు

ఆలోచనల నుండి ఆశయాలు
ఆశయాల సాధనకు ఉద్యమాలు
ఉద్యమాల సాఫల్యానికి త్యాగాలు
నాడు చదువుకున్న చరిత్ర పాఠాలు

ఆలోచనలని మింగేస్తున్న ఆవేశాలు
ఆవేశాలు ముదిరి ఉన్మాదాలు
ఉన్మాదంతో రాలిపోతున్న జీవితాలు
నేడు చూస్తున్న చేదు వాస్తవాలు

Wednesday, March 10, 2010

నాయకుడు

రోజూ వాడొక పెగ్గేసుకుని
తల తెగ్గోసుకుంటానంటాడు
తలలు తెగుతూనే ఉన్నాయి
వాడు వాగుతూనే ఉన్నాడు

ఓ తమ్ముడు ఉరేసుకున్నాడు
మరో మిత్రుడి జాడలేదు
మనోళ్ళంతా చీల్చబడ్డారు
మనలో కొందరు కాల్చబడ్డారు

శవాల్ని కావిలించుకుని
వాగుతూనే ఉన్నాడు
రోజూ వాడొక పెగ్గేసుకుని
తల తెగ్గోసుకుంటానంటాడు

Friday, March 5, 2010

మా ఊరి రైలు

కంపార్ట్ మెంట్ మెట్లపై పెట్టి ఒక కాలు
చెప్తుండగా నా మిత్రులకి వీడ్కోలు
సుయ్ మని వేసేవాడు గార్డు విజిలు
ఖయ్ మని కూస్తూ బయలుదేరేది మా ఊరి రైలు

అందరకీ కావాలి కిటికీ దగ్గర సీటు
(విసర్జనకి లేచావో పడిందే వేటు)
సంపాదించాకా ఆపక్కన చోటు
బయటకు చూస్తే ప్రకృతి భలే క్యూటు

చదువుతుండగానే కమ్మని కధలు
కమ్ముకొచ్చేవి తీయని కలలు
కధలలో నేమెచ్చే కొన్ని పాత్రలు
కదలివచ్చేవి ఆ యాత్రలలో!

పూసలమ్మే ఓముసలి సాయిబు
మాసినగుడ్డల ఆ నిత్యగరీబు
తృప్తిపడటంలో వాడే నవాబు
కర్మయోగానికి కాదా కితాబు?

తత్వాలు పాడేవాడొక సాధువు
తన మనసే దేవుని కొలువు
ప్రశాంతతకి అతనొక నెలవు
ఆసన్నిధిలో దేనికీ వెరవవు

వేణువూదిన ఓ గుడ్డి భిక్షువు
ఏడుపాపును ఒడిలోన శిశువు
ఏతల్లిచూపినా కాస్త కనికరం
బిచ్చగాడికి దక్కేను అల్పాహరం

ఈడు వచ్చిన కొందరు కుర్రాళ్ళు
తోడు కోసం బోగీలన్నీ తిరిగేవాళ్ళు
ప్రేయసికి ఇచ్చినా పెద్ద బహుమతి
ప్రణయానికి వచ్చునా అనుమతి?

ఉసూరుమంటూ, ఊరూరూ ఆగుతూ
ఉరకలేసుకుంటూ,భారంగా ఊగుతూ
రయ్ మని పోయేది పాసింజరు రైలు
ఖయ్ మని కూసేది మా ఊరి రైలు

Thursday, March 4, 2010

అమెరికాలో మన ముత్యాలు

అమెరికాలో మన తెలుగు ముత్యాలు
పెంచుకోవడానికి కాస్త జీతభత్యాలు
ఎప్పుడైనా పలికినా కొన్ని అసత్యాలు
ఆఫీసు పనులే వారికి ప్రధాన కృత్యాలు
ఓపిగ్గా భరిస్తూనే బాసుల పైత్యాలు
చలాగ్గా సాధిస్తారు పనిలో ఆధిపత్యాలు

Wednesday, March 3, 2010

కల్కి

జాతినుద్ధరించటకు ఓ కల్కి
నీతివాక్యములెన్నో పల్కి
నిజము తెలుప మీడియా కెలికి
జనులు పడిరి ఉలికి ఉలికి

భక్తి ముసుగులో వ్యాపారం
వెకిలి చేష్టల వ్యవహారం
నకిలీ స్వాముల బండారం
కనులు తెరవాలి ఇకనైనా అందరం