Monday, May 24, 2010

అమెరికాలో తెలుగు రాకుమారి

అమెరికాలో నువ్ కాల్పెట్టిన
అలనాటి నుండి నేటిదాకా
'డీల్స్' అంటూ వేలం వెర్రిగా
మాల్స్ చుట్టూ పరుగులెడుతూ

కొనితెచ్చిన ఆచెత్త నంతన్
ఇంటినిండా కొలువు పెట్టినా
ఇంకేదో కొన్లేదని,కలతచెందుతూ
భర్తేదో అన్నాడని,కన్నీరొలుకుతూ

సాతానుకి ఆత్మను తాకట్టు పెట్టిన
పాతకధలోని రాకుమారి వలే,
ఈ వినియోగ మాయా ప్రయోగశాలలో
వస్తువ్యామోహంలో పడికొట్టుకుంటూ

నాడు కాలేజీరోజుల్లో మేరీజీలపై
నువ్వు దంచిన ఉపన్యాసాలు,
భావి జీవితంపై రాసిన వ్యాసాలు
ఇస్టులతో చేసిన సాహితీ గోష్టులు...

ఆపాతజీవితపు ఆకస్మిక జ్ణాపకాలలో
నీరూపాన్ని నువ్వే పోల్చుకోలేక
నీ గమనమెటో తేల్చుకోలేక
నువ్వు పడుతున్న నరకయాతన
నీలో రాబోయే మార్పుకి చిన్నసూచన

Thursday, May 20, 2010

బ్లాగు భారతం

నీవైన కొన్ని అనుభవాలను
నలుగురితోనూ పంచుకోవాలని
బ్లాగిన ఒకట్రొండు పేజీల రాతలకి
వావ్! కేజీలలో కామెంట్ల వాతలు

విదేశీ సీమలో,స్వదేశీ భాషలో
నువ్వేదో ఉగ్గూ,ఉంగా అని రాస్తే
వాడేమో వస్తువు,శిల్పం అని సణుగుతూ
అనుభూతిలేదు రచనలో పో,అంటాడు

చరుచుకుంటూ తమ జబ్బలు
విమర్శకులు పెట్టుకునే పెడబొబ్బలు
బ్లాగ్లోకంలో నువ్వూహించని ఫన్
నవ్వి నవ్వి నీ కడుపు నొప్పెట్టున్

భావవ్యక్తీకరణ నీ జన్మహక్కు
బ్లాగే అవకాశమే ఒక పెద్దలక్కు
రాయడం ఎన్నడూ మరువకోయి
ఉందిలే అందులో కొంత హాయి

Wednesday, May 19, 2010

మౌనానికి ధ్యానానికి మధ్య...

గురకలు కొడుతోంది ఊరు
ఊరుచివర పాతకాలపు ఇల్లు
ఇల్లంతా రంగులలో చిత్రాలు
ఒళ్ళంతా కళ్ళతో,స్వప్నిస్తూ వాడు

సంజీవిని తెస్తున్న మారుతి
వెన్నెల్లో స్నానిస్తున్న ప్రకృతి
నిద్రలో పైటజారిన యువతి
ఎన్ని గీసినా,ఏదో వెలితి

మనసు తట్టిన అలికిడి
గుండెలోతుల్లో అలజడి
నావ తీరం చేరేదెన్నడో?
కల చిత్రంగా మారినప్పుడు!

మొలకెత్తిన తన కలను
హత్తుకుని,తలకెత్తుకుని
మైకంతో, మమేకంతో
మరోబొమ్మ గీయడం మొదలెట్టాడు

Thursday, May 13, 2010

లవ్ ఇన్ మిచిగన్ -2

తొలకరి జల్లుల పలకరింతలతో
మదిలో ఎన్నెన్ని పులకరింతలో!
మాజీప్రియుడి తాజా జ్ణాపకాలు
చినుకులు మేనుని తాకినంతలో!

చిందులేయగా ఆకాశం ఉరిమి
ముద్దులు లంచమీయను భూమి
వేయంగానే మబ్బుల పరదాలు
భూమ్యాకాశాల మోటు సరసాలు

కప్పుకున్నా వృక్షాలతో వక్షోజాలను
దాచలేక నక్షత్రకాంతిలో,నఖక్షతాలను
తెగసిగ్గుపడును పాపం భూమి!
కమ్ముకొనును ఆకలితో ఆకాశం.

విరహం రేగును ప్రతిహృదిలో
ఊహలు ఊగును ఊయలలో
ఎవరు విసిరేనో ఈవలపు బాణాలు?
ప్రకృతికిపుడు పురిటి స్నానాలు!

Wednesday, May 12, 2010

ఒంటరి గీతం

నాటకం ముగిసింది. చప్పట్ల మోత.
వేషం తీయకుండా, తెరవెనుకే తచ్చాడుతున్నాను.
కాసేపట్లో,మళ్ళీ ఒంటరినౌతాను.

నాటకం ముగియటమంటే, రోజువారీ రొచ్చులోకి జారడం!
అప్పుడు నాకు మరో పేరుంటుంది, కులం కూడా.
బతకటానికి ఏవేవో చేస్తుంటాను.

ఏదో అర్ధంగాని గుండెకోత. భరించలేని ఉక్కపోత.
డైలాగులూ ఉండవు, అనుభూతులూ ఉండవు.
నాదికాని లోకంలో, దారితప్పిన బాటసారిని.

అభిమాన పాత్రలను ఆవాహన చేస్తూ
ఆత్మవంచన నుండి సత్యాన్వేషణ దిశగా
మళ్ళీ జీవించడానికి సన్నద్ధమౌతుంటాను.

Tuesday, May 4, 2010

నవలా సార్వభౌమా!

తరగతి గదిలోకి పరధ్యానంలా
తిరునాళ్ళలోని కక్కుర్తిలా
ఇలా వచ్చావేం నవలాసార్వభౌమా?

వారపత్రికలలో నీవు జరిపిన
సాహిత్యరతితో జన్మించిన
భూతవైద్యుల్,కుహానా మేధావులన్
చూసిపోదామని వచ్చావా?

పరిశోధనంటావు,పరిశీలనంటావు
అసలే సినీ కామెర్ల రోగివి నీవు
అందునా విదేశీ పైత్యాన్ని
పధ్యంగా మొదలిడినావు

గ్రంధచౌర్యంలో నువ్వు సవ్యసాచివి
ఏ ఎండకా గొడుగుపట్టే నంగనాచివి
నీరచనలతో వచ్చేను మెదళ్ళకు వాపు
నీజబ్బలకు లేదయ్యా ఎన్నడూ అలుపు

( శ్రీశ్రీ శరచ్చంద్రిక ప్రభావంలో.. 90లో అల్లినది. )