Friday, March 5, 2010

మా ఊరి రైలు

కంపార్ట్ మెంట్ మెట్లపై పెట్టి ఒక కాలు
చెప్తుండగా నా మిత్రులకి వీడ్కోలు
సుయ్ మని వేసేవాడు గార్డు విజిలు
ఖయ్ మని కూస్తూ బయలుదేరేది మా ఊరి రైలు

అందరకీ కావాలి కిటికీ దగ్గర సీటు
(విసర్జనకి లేచావో పడిందే వేటు)
సంపాదించాకా ఆపక్కన చోటు
బయటకు చూస్తే ప్రకృతి భలే క్యూటు

చదువుతుండగానే కమ్మని కధలు
కమ్ముకొచ్చేవి తీయని కలలు
కధలలో నేమెచ్చే కొన్ని పాత్రలు
కదలివచ్చేవి ఆ యాత్రలలో!

పూసలమ్మే ఓముసలి సాయిబు
మాసినగుడ్డల ఆ నిత్యగరీబు
తృప్తిపడటంలో వాడే నవాబు
కర్మయోగానికి కాదా కితాబు?

తత్వాలు పాడేవాడొక సాధువు
తన మనసే దేవుని కొలువు
ప్రశాంతతకి అతనొక నెలవు
ఆసన్నిధిలో దేనికీ వెరవవు

వేణువూదిన ఓ గుడ్డి భిక్షువు
ఏడుపాపును ఒడిలోన శిశువు
ఏతల్లిచూపినా కాస్త కనికరం
బిచ్చగాడికి దక్కేను అల్పాహరం

ఈడు వచ్చిన కొందరు కుర్రాళ్ళు
తోడు కోసం బోగీలన్నీ తిరిగేవాళ్ళు
ప్రేయసికి ఇచ్చినా పెద్ద బహుమతి
ప్రణయానికి వచ్చునా అనుమతి?

ఉసూరుమంటూ, ఊరూరూ ఆగుతూ
ఉరకలేసుకుంటూ,భారంగా ఊగుతూ
రయ్ మని పోయేది పాసింజరు రైలు
ఖయ్ మని కూసేది మా ఊరి రైలు

2 comments:

Rama Prasad said...

మీ అంత్య ప్రాస చాలా చక్కగా అమిరింది.

ఆంగ్ల పదాల వాడుకను భావవ్యక్తీకరణలో మినహాయిస్తే వచ్చే మాధుర్యము అమోఘముగా ఉంటుందనేది నా అవగాహన.

Prasad Samantapudi said...

రాం ప్రసాద్,
ఆంగ్లపదాల్ని కలపాల్సి వచ్చినప్పుడు నాక్కూడా కాస్త అసౌఖర్యంగానే ఉంటుంది. ప్రతి భాషా ఎన్నో కొన్ని పదాల్ని ఇతర భాషల నుండి కలుపుకోకతప్పదేమో!