Tuesday, July 10, 2007

బెట్టాడ హూవు(Hill Flower) - కన్నడ చిత్రం

రాము అనే పేదబాలుడు కొండప్రాంతంలోని గ్రామంలో, తల్లితండ్రులతో నివసిస్తూ ఉంటాడు. అతనికి చెల్లాయి, తమ్ముడు ఉంటారు. తండ్రి అడవిలో కట్టెలు కొట్టి అమ్మితే, తల్లి సెంటర్లో కూరగాయలు అమ్ముతూ ఉంటుంది. పేదరికంతో సతమతమవుతూనే, రాము చదువుకుంటూ ఉంటాడు. అన్న వద్దని సలహా చెప్పినా, తండ్రి, రాముని చదువుకోమని ప్రోత్సహిస్తాడు.

రాము స్కూలు టీచరు పిల్లలకు నీతిపాఠాలను భోధిస్తూ ఉంటారు. ముఖ్యంగా రామాయణాన్ని - శ్రీరాముని కధని, రాముని ధర్మనిరతిని, పితృవాక్యపరిపాలనని... పిల్లలకి వీలైనపుడల్లా చెబుతూ ఉంటారు. రాము, శ్రీరాముని కధని అత్యంత శ్రద్ధతో వింటుంటాడు. తను దాచుకున్న డబ్బులతో చిన్న చిన్న కధల పుస్తకాలను కొని చదువుకుంటుంటాడు.

వేసవి ముగియటంతో టూరిస్టులు వెళ్ళీపోతారు. దాంతో రాము తండ్రి కట్టెలు కొనేవారే ఉండరు. పూట గడవడం కష్టంగా ఉంటుంది. రాము తండ్రి పట్నంలో ఏదినా పని చేసి డబ్బు పంపుతానని బయలుదేరుతాడు. కుటుంబం అతనికి వీడ్కోలు చెప్పటానికి బస్టాండుకి వెళుతుంది. అతను వెళుతూ, "పేదవాడికి చదువుకునే అదృష్టం లేదని, ఇక నుండి కుటుంబ యజమాని రామూనే", అని తను నాల్గు రూపాయలు సంపాదించాక తిరిగి స్కూలుకి పంపుతానని దీనంగా అంటాడు. రాము సరేనంటాడు.

తండ్రి వెళ్ళిన తర్వాత కుటుంబపరిస్థితి బాగా క్షీణిస్తుంది. రాము చదువుమానేస్తాడు. బస్టాండుకి వెళ్ళి, డ్రైవర్ మస్తాన్ ని తండ్రి గురించి వాకబుచేస్తాడు. "డబ్బు పంపుతానన్నాడు. ఇచ్చాడా?" అని అడుగుతాడు. మస్తాన్ గేలిచేస్తాడు.
రాము ఒక టీచరు దగ్గర ఇంగ్లీషు నేర్చుకుంటుంటాడు. ఆవిడ తను మరో ఊరు వెళుతున్నానని చెబుతుంది. రాముకి ఒక ఇంగ్లీష్ స్వభోధిని ఇస్తుంది.

రాము బస్టాపులో లగేజీలు మోసి వచ్చిన డబ్బులు తల్లికిస్తుంటాడు. తల్లి రూపాయకి ఇంతని అతనికిస్తూ ఉంటుంది. తల్లిచ్చిన డబ్బులు రాము ఒక ముంతలో దాచుకుంటూ ఉంటాడు.

రాము ఇంటికి సమీపంలో ఒక చిల్లరదుకాణం ఉంటుంది. అక్కడ తినుబండారాలతో పాటుగా చక్కని కధల పుస్తకాలు కూడా ఉంటాయి. ఒకరోజు రాము ఒక విలువైన పుస్తకాన్ని చూస్తాడు. దాని అట్టమీద "జనప్రియ వాల్మీకి రామయణం" అని ఉంటుంది. రాము ఎంతో సంబరపడతాడు. దాని వెల పది రూపాయలని తెలుసుకుంటాడు. ఎలాగైనా దానిని కొని చదవాలని నిర్ణయించుకుంటాడు.

రాము తండ్రి డ్రైవర్ మస్తాన్ ద్వారా కొంత డబ్బు పంపటంతో కుటుంబం కాస్త కుదుటపడుతుంది.

రాము సహవాసులతో కలని గడ్డికోతకి వెళుతుంటాడు. రాముకి ఒక ఆంగ్లవనిత తారసపడుతుంది. ఆమె ఒక టీచరు, అరుదైన పువ్వులని సేకరించి వాటిని చిత్రిస్తూ ఉంటుంది. రాము రెండు పూలమొక్కలను అమెకిస్తాడు. ఆమె రెండు రూపాయలిస్తుంది. తను పువ్వులపై పుస్తకాన్ని వ్రాస్తున్నానని, అందులో రాము పేరుని ప్రస్తావిస్తానని అంటుంది. "ఆ పుస్తకం అందరూ చదువుతారా?" అని రాము ఆదుగుతాడు. ఆమె అవునని, రాముకి ఒక కాపి పంపుతానని అంటుంది.

రాముకి ఆమె ఒక బుట్ట రెండు పరికరాలు ఇస్తుంది. రాము వాటి సాయంతో పూలమొక్కలను తెస్తుంటాడు. ఆమె రాముకి ఒక చిత్రాన్ని చూపిస్తుంది. అది ఒక అరుదైన కొండపూవు. ఎలాగైనా దానిని సంపాదించమని, అది తేగలిగితే పది రూపాయలిస్తానని అంటుంది.

రాము ఉదయాన్నే లేచి సాయంత్రం వరకూ అడివంతా గాలిస్తాడు. చివరకు కొండపూవు దొరుకుతుంది. అతని ఆనంధానికి అవధులు ఉండవు. ఆంగ్లవనితకిస్తాడు. ఆమె సంతోషించి అతనికి పది రూపాయలు, కేక్ ఇస్తుంది. తాను రెండురోజుల్లో తన దేశం వెళ్ళిపోతున్నానని చెప్తుంది.

రాము ఆలస్యంగా ఇంటికి చేరతాడు. తల్లి కంగారు పడుతుంది. చెల్లయికి కేక్ పెడతాడు. తల్లికి అబద్దం చెప్పి అయిదు రూపయలే ఇస్తాడు.

మర్నాడు ఉదయాన్నే లేచి తన డిబ్బీలో డబ్బులు లెక్కపెట్టుకుని పుస్తకాల షాపుకి బయలుదేరుతాడు. అమితానందానికి గురౌతాడు. జనప్రియ వాల్మీకి రామయణం తను కొనబోతున్నాడు.
కాని,... అతనికి ఏదో స్పురిస్తుంది. ఓ జీవితసత్యం తెలుస్తుంది. చాలీ చాలని చిరుగుల గొంగలి, చెల్లాయి, తమ్ముళ్ళ అవస్థ...

రామాయణం కంటే గొంగలి ఎక్కువ ఉపయోగమా?

అతను గొంగలి కొంటాడు. తల్లి చేతుల్లో పెడతాడు. తల్లి ఆశ్చర్యంతో "ఎక్కడిది?" అని అడుగుతుంది. తన అబద్దం గురించి, తన రామాయణం కోరిక గురించి చెప్తాడు. తల్లి ఆనందంతో ఉప్పొంగుతుంది. "రాము మన దరిద్రాన్ని నువ్వు పొగొట్టగలవు" అని ఆనందభాష్పాలతో హత్తుకుంటుంది.

* * *

ఆ సాయంత్రం, రాము ఒంటరిగా బయట కూర్చుని దు:ఖిస్తుంటాడు.

"జనప్రియ వాల్మీకి రామాయణం"

* * *

వాస్తవిక చిత్రీకరణ:

చిత్రంలో అంతా( స్కూలు టీచరు, ఇంగ్లీషునేర్పే యువతి, ఆంగ్లవనిత...) రాముకి పరొక్షంగా సాయపడతారు.

a. స్కూలు టీచరు రాముకి రామాయణ గాధలను చెబుతాడు. రాము స్కూలు మానేసినపుడు, తల్లిని మార్కెట్లో కలిసి "రాము ఎందుకు రావట్లేదు?" అని అడుగుతాడు. ఆమె తన ఆర్ధిక ఇబ్బందిని తెలియచేస్తుంది. టీచరు క్షణకాలం భాధపడి సాగిపోతాడు.

b. ఇంగ్లీషు నేర్పే యువతి తాను మరో ఊరు వెళిపోతున్నానని చెప్పినపుడు, రాము, "నాకు ఇంగ్లీషు ఎవరు నేర్పుతారు?" అని అడుగుతాడు. ఆమె అతనికి "ఇంగ్లీష్ స్వభోధిని" ఇస్తుంది. అంతేగాని బట్టలు, రొట్టెలు ఇవ్వదు.

c. ఆంగ్లవనిత సంపన్నురాలైనప్పటికి, రాముకి పువ్వులకి ఎంత ఇస్తానంటుందో అంతే ఇస్తుంది.

2. సుందరమైన ప్రకృతిలాగా, అందరి వ్యక్తిత్వాలు సుందరంగానే ఉంటాయి.

a. బస్సు డ్రైవర్ మస్తాన్, రాము బరువులు మోయడం చూసి జాలిపడతాడు. పట్నంలో రాము తండ్రిని కలుస్తాడు. రాముని పొగుడుతాడు. అతనిచ్చిన డబ్బులు రాముకందచేస్తాడు.

b. రాము తల్లి తోట యజమానిని, "ఇల్లు గడవట్లేదు. సాయం చేయమంటుంది." అతను కుదరదు అంటాడు. ఆమె ఏదైనా పని చేస్తానంటుంది. అతను నిచ్చెన ఎక్కే పని ఉంది అంటాడు. ఆమె చేస్తానంటుంది. అతను స్త్రీలు అలాంటివి చేయకూడదు అంటాడు.

ప్రతి సన్నివేశం కూడా చాలా సహజంగా చిత్రీకరించబడింది. కాకతాళీయత, అద్భుతాలు లేవు. రాము కష్టాలకు చలించిన ప్రెక్షకులు, "అతనికి ఎవరైనా ధన సహాయం చేయవచ్చు కద," లేదా "అడవిలో ఏదైనా నిధి దొరకవచ్చు కదా" అని ఆశించవచ్చు. "రాము తల్లి వేశ్యగా మారుతుందా" అని ఆలోచించెవారు ఉంటారు. కాని ఎలాంటి మలుపులు లేకుండా సాదాగా ముగుస్తుంది.



(written on 03/14/1996)

No comments: