Saturday, July 14, 2007

సాహిత్య పరామర్శ

మిత్రుడు అచ్యుతరామయ్య - 97లో తొలిపరిచయం, సారధీ స్టూడియోస్ వద్ద. ఆయన అభ్యుదయవాది, రచయిత. మేమంతా అప్పట్లో తరచుగా సారధీ స్టూడియోస్ లో ఫారిన్ క్లాసిక్స్ చూస్తుండేవాళ్ళం. తర్వాత మైత్రీవనం ఎదురుగా ఉన్న కేఫ్ లో ఇరానీచాయ్ చప్పరిస్తూ, అలా గంటలు గంటలూ సినిమాలు, సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం.

ఆయన వ్రాసిన కొన్ని కధలపై అప్పట్లో నా అనుభూతులకి, ఆలోచనలకి అక్షరరూపం ఇచ్చాను. ఇది విశ్లేషణ కాదు, విమర్శ అసలే కాదు. పరామర్శ అనవచ్చా?

It's a friendly hug.

* * *

గా ర డీ

సాధారణంగా, రచయితలు ప్రారంభదశలో తమ గురించే కధలుగా వ్రాస్తారు. కొంతకాలం గడిచాకా, కొన్ని కధలు వ్రాసాకా... ఆలోచనాపరుడైన రచయిత, "ఇక వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టాలని", నిర్ణయించుంటాడు. ఇదిగో ఇలా గారడీ లాంటి కధ వ్రాస్తాడు. తన సత్తా చూపిస్తాడు.

కేంద్రప్రభుత్వ ఉద్యోగి అయిన రాంప్రసాదుకి తన సొంతరాష్ట్రానికి బదిలీ అవుతుంది. స్వగ్రామం మల్లాం వెళ్తాడు. మట్టిరోడ్డు మీద నడుస్తూంటాడు. అతని హృదయంలో సంగీతం. పచ్చని పొలాల నవ్వులాట. పొలంగట్లు దాటుకుని వెళ్తుంటే మది బాల్యస్మృతులతో ఫించం విప్పుతుంది. ఊరివారంతా ఆప్యాయంగా, కొంటెగా పలకరిస్తుంటారు. వారికి ప్రేమగా, వినయంగా జవాబిస్తాడు. ఊరిని ప్రజల్ని ప్రేమిస్తూనే, అక్కడ అంతగా అభివృద్ధి లేదని, ఇంకా ప్రజల్లో అజ్ఞానమూ, మూఢనమ్మకాలూ పోలేదని విచారిస్తాడు. ఇంటిదగ్గర మర్యాదలు పూర్తయినాకా, అలా పెద్దవీధిలోకి బయలుదేరతాడు. ఢమరుకం శబ్దం విని "గారడీ చూసి ఎన్నాళ్ళయిందో" అనుకుంటూ అటువెళ్తాడు.

ఇక్కడ గారడీ గౌస్ అనె పాత్ర ప్రవేశిస్తుంది. రాంప్రసాద్ దృస్టికోణంలో కధ ప్రారంభించిన రచయిత గౌస్ దృస్టికోణంలో చెప్పటం ప్రారంభిస్తాడు. దృస్టికోణాన్ని గౌస్ నుండి రాంప్రసాద్ కి, రాంప్రసాద్ నుండి తిరిగి గౌస్ కి... ఇలా దృస్టికోణాన్ని మారుస్తూ కధలో గొప్ప బిగిని సృస్టిస్తాడు. పాఠకుడు ఆందోళనపడతాడు. ఆలోచిస్తాడు. కన్నీరు కారుస్తాడు. "హమ్మయ్య అనుకుంటాడు.

ఈ కధలో కధానాయకుడు ఎవరు? రాంప్రసాదా? గౌసా? లేక ఇద్దరూనా?
గౌస్ గారడిని రాంప్రసాద్ ఎద్దేవా చేస్తాడు. గౌస్ ఏదోరకంగా రాంప్రసాద్ ని మభ్యపెట్టి గారడి పూర్తిచేయాలనుకుంటాడు. కాని రాంప్రసాద్ అడ్డుపడ్తాడు. ఏదీ దారీ? పందెంకోసం పిల్లాణ్ణీ చంపుకోవాలా? "భగవంతుండా పిల్లాణ్ణి రక్షించు" అని పాఠకుడు ప్రార్ధిస్తాడు.

"ఆఖరి చూపైనా దక్కించుకోవాలని కొడుకు ముఖంపై ఉన్న దుప్పటిని కొద్దిగా కిందికి లాగాడు. బాగా అలిసిపోయాడేమో, అప్పటికే వాడు గాఢనిద్రలో ఉన్నాడు. వాడికి తండ్రిమీద ఎంతనమ్మకం?! ఇంతగా నమ్మించి తను వాడి గొంతుకోస్తున్నాడా?..."

ఇక నాకు దు:ఖం ఆగలేదు. గుండెల్ని పిండే వేదనని అధిగమించటానికి కాసేపు చదవటం ఆపేసాను. నేనిలా ప్రశ్నించుకున్నాను:

"కళ అంటే ఏమిటి?"

"ఆనందాన్నో విషాధాన్నో, రచయిత అనుభవించి, తన అనుభూతిని పాఠకునిలో కలిగించటం"

గౌస్ ఎందుకు గారడి చేస్తున్నాడు? అతని జీవనస్థితి ఎలాంటిది? రచయిత చాకచక్యంగా వివరిస్తాడు. ప్రపంచమే గారడీల మయమని, గౌస్ చేసే గారడి తాతలనుండి ఏదో తిండిగింజలకోసం చేసే మామూలు గారడీ అని రాంప్రసాద్ గ్రహిస్తాడు, పాఠకుడూ గ్రహిస్తాడు.

చివరకి కధ సుఖాంతమవుతుంది.

ఇంతకీ కధానాయకుడు ఎవరు? రాంప్రసాదా? గౌసా? లేక ఇద్దరూనా?

"మానవత్వం," బహుశా... ఇదే కధలో హీరో. ఇది రచయితలో ఉంది. అది పాత్రలలో ప్రవేశించింది. పాఠకుల్ని చేరుతుంది.

----------------------

ఆనందమే జీవితమకరందం


ఒక మంచి రచన, కధతో పాటు ఆ రచయిత యొక్క సంస్కృతిని కూడ తెలియచేస్తుంది. ఆ సంస్కృతిని కాస్త పరిశీలిస్తే, ఆ రచయిత మతం; ఆయన విశ్వాసాలు, ఆదర్శాలు తెలుస్తాయి.

"ఆనందంగా జీవించడం అనేది ఓ గొప్పకళ. అనేక కళల గురించి భోధించే కళాశాలలు ఇంత గొప్ప కళని ఎందుకు నిర్లక్ష్యం చేసాయి?" అని చైతన్య మధనపడుతుంటాడు.

మార్గమధ్యలో ప్రభాకర్ అనే ఓ పాత స్నేహితుడు కలుస్తాడు. వాళ్ళు వర్షంలో తడుస్తారు. జొన్నపొత్తులు తింటారు. చాయ్ తాగుతారు. చైతన్య చలాకీతనం పట్ల ప్రభాకర్ అసూయ పడతాడు. నోరు వెళ్ళబెట్టి, ఆనందంగా ఉందాలంటే ఎలా? అని ప్రశ్నిస్తాడు.

బుద్ధుడి కాలం నుండి నేటివరకూ ఎంతో మంది తత్వవేత్తలు, మేధావులూ... మానవుడు ఆనందంగా ఉండటానికి రకరకాల మార్గాలు సూచించారు. కాని విచారం పోలేదు. రాన్రాను ఏడుపుగొట్టువాళ్ళతో ప్రపంచం నిండిపోతోంది.
రచయిత పెద్ద పెద్ద సిద్ధాంతాల జోలికి పోకుండా, సగటు మనిషి ఆనందంగా ఎలా ఉండవచ్చో చూపిస్తాడు. అంతర్లీనంగా సిద్ధాంతాలను ఎద్దేవా చేస్తాడు.

చివరకి ఆనందం అనేది వ్యక్తిగతం అని తీర్పుచెప్తాడు.

నేను ఇక్కడే రచయితతో విభేధిస్తున్నాను.

ఆనందం వ్యక్తిగతమైనదా? సమాజగతమైనదా?

రెండూనూ. ఈవిషయం రచయితకూ తెలుసు.

రవాణాసౌకర్యాలు మెరుగుపడిన తర్వాత, పాశ్చాత్య దేశాలనుండి మనకు టన్నులకొద్దీ సాహిత్యం లభిస్తోంది; ... ఈ బాపతు సాహిత్యంలో సమస్యలు గొప్పగా ఉంటాయి. పరిష్కారాలు మాత్రం కృత్రిమంగా ఉంటాయి. పాశ్చత్య సాహిత్య ప్రభావం ఈ కధారచనపై ఎంతవరకూ ఉంది? అని ఆలోచించటానికి నేను సంకోచించట్లేదు.

ఇది గొప్ప కధావస్తువు.

రచయితకి ఇంకా అవగాహన, కొంత ముడిసరుకు అవసరం అని నమ్ముతున్నాను.

రచయిత ఇదే కధావస్తువుని తీసుకుని, ప్రతీ ఐదేళ్ళకోసారి రాయాలని కోరుతున్నాను.

---------------

రసభంగం

తెలుగు సాహిత్యంలో, బహుశా, హాస్యరచనలు తక్కువ. నేను చదివింది మరీ తక్కువ. ఎప్పుడైనా హాస్యరచన చదివి, హాయిగా నవ్వుకున్నా, ఆనకెపుడో... ఆ రచన గురించి ఆలోచిస్తూ అసంతృప్తి చెందేవాణ్ణి. "పప్పు హాస్యం" అని సణుక్కునే వాణ్ణి. నేచదివిన హాస్యరచనలన్నీ మధ్యతరగతి బ్రాహ్మణ జీవితాలతో నిండి ఉండేవి, బ్రాహ్మణేతరులు రాసినవి కూడా. ఈ దౌర్భాగ్యం వలన నాకు హాస్యరచనల పట్ల వెగటు కలిగింది.

ఇక మన హాస్యరచనలింతే అని విరక్తి చెంది, మొలకి ఆకులు చుట్టుకుని, సీరియస్ సాహిత్యం నెత్తిన పెట్టుకుని హిమాలయాలకి బయలుదేరాను. దారిలో వెనుకనుండి ఎవడో మొట్టాడు. వెనక్కి తిరిగి చూసాను. నామిని గాడు. "ఏ వేలు మొట్టింది", అన్నాడు వెకిలిగా. "నాకీ హాస్యం గిట్టదు", అన్నాను. నాకు కితకితలు పెట్టాడు. పుస్తకాలన్నీ కిందపడ్డాయి. వాడు మట్టి, తేనె కలిపి పిసికి ఉండగా చేసి, "సున్నుండ...తినరా" అని ఇచ్చాడు. కొద్దిగా తిన్నానో లేదో భళ్ళున కక్కుకున్నాను. అంతకాలంగా నాలో జీర్ణం కాకుండా ఉన్న హాస్యరచనలన్నీ బయటకి వచ్చాయి. అప్పుడు వాడు, "పచ్చ నాకు సాక్షిగా" చదవమని ఇచ్చి మాయమయ్యాడు. కన్నీరు, నవ్వూ ఒకేసారి వచ్చాయి. మరలా జీవితం పట్ల ఆశ పుట్టింది.

* * *

రసభంగం చక్కని హాస్యరచన. హాయిగా నవ్వుకున్నాను. కాని, ... ఆ రచన గురించి ఆలోచిస్తూ కొద్దిగా అసంతృప్తి చెందాను. కొద్దిగా పప్పు వాసన కొట్టింది. నాకు కావలిసింది మట్టి వాసన. తేనెకూడా కలపాలి సుమా.

హాస్యరచనలు మనకి చాలా అవసరం. కాని ముందుగా బ్రాహ్మణ భావజాలం నుండి బయటకు రావాలి.

మీరు మరిన్ని హాస్యరచనలు చేయాలి.

-------------

అభి `మాన` భంగం


తెలుగు సాహిత్యంలో ఇపుడు దళితవాదం, స్త్రీవాదం ఉద్యమస్ధాయికి చేరుకున్నాయి. పత్రికలు కూడా వీటికే పెద్దపీట వేస్తున్నాయి. కొత్తకోణంలో చక్కని సాహిత్యం వస్తోంది.

దళిత రచయితలు సమావేశాలు జరిపి, దళిత స్పృహ, దళిత అనుభవం వంటి కొత్త పదాలను ఆవిష్కరిస్తున్నారు. స్త్రీవాద రచయిత్రులు సమావేశమై, మాతృత్వం, శ్రమ, లైంగికత్వం అంటున్నారు.

ఈదళిత సిద్ధాంతాలు, ఆలోచనలు నల్లజాతివారి నుండి అరువు తెచ్చుకున్నవని అందరకీ తెలుసు. అలాగే, స్త్రీవాద భావాలు కూడా పూర్తీగా పాశ్చాత్య భావాలు. పేస్టు, సబ్బు వంటి వాటికి కూడా విదేశాల మీద ఆధారపడిన మనకు ఇది పెద్ద తప్పు కాదు. జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవచ్చు.

మార్క్సిజాన్ని లెనిన్ రష్యాకి తగ్గట్టుగాను, మావో చైనాకు తగ్గట్టుగాను మార్చుకున్నారు. ఫలితాన్ని పొందారు? కాని, దళితవాదులు ముఖ్యంగా స్త్రీవాదులు విదేశీజ్ఞానాన్ని, మనకు తగ్గట్టుగా మార్పుచేయటంలో పూర్తిగా సఫలం కాలేదు. ముందుగా వారు స్వదేశీ జ్ఞానాన్ని బాగా అధ్యయనం చేయాలి. దీనికి చాలా సమయం, అంకితభావం కావాలి.

* * *

"ఎవరైనా స్త్రీ మానభంగానికి గురైతే, శీలం అనే పదం వాడి ఆమెను మరింత క్షోభపెట్టకుండ, ఒక అవయవానికి గాయమైనట్టుగా భావించి ఆమెను ఆక్కున చేర్చుకోవాలి". బహుశా రచయిత కధలో చెప్పాలనుకున్నది ఇదేనని భావిస్తున్నాను. ప్రతీ అభ్యుధయవాది రచయితతో చేయి కలుపుతాడు.

కధ ప్రారంభంలో, మన కధానాయిక కౌస్తుభ డాబాపై స్నేహితులతో సాహిత్యచర్చలు జరుపుతుంటుంది. అప్పటికే, రచయిత భాషలో, ఆమె అవయవానికి గాయం అవుతుంది. తల్లి క్రిందికి పిలుస్తుంది.

"మొన్న రాత్రి నీపై అత్యాచారం జరిగిందట... ఒక్క ముక్క కూడా మాతో అనలేదు - తల్లితండ్రులం చచ్చామనుకున్నామా?", తండ్రి నారాయణమూర్తి కోపంగా అరుస్తాడు.

"అది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అందులో మీకు చెప్పాల్సింది గాని, దాని వల్ల మీరు తలెత్తుకు తిరగలేకపొవడానికి కానీ ఏమీ లేదు"

"నీ వ్యక్తిగత విషయాలయితే మాత్రం మాతో చెప్పాల్సిన భాధ్యత నీకు లేదా?"
"మొన్నామధ్య బాత్రూంలో కాలు జారి పడితే, మోచిప్ప పగిలి బోల్డంత రక్తం పోయింది. ఆవిషయం మీకెవరకీ చెప్పలేదే. అలాగే ఇదీను."

బహుశా రచయిత, కౌస్తుభ విద్యావంతురాలని, స్వతంత్ర వ్యక్తిత్వం కలదని పాఠకుల్ని నమ్మించటానికి తిప్పలు పడుతుంటాడు. కాని పాఠకుడు ఇలా ఆలోచిస్తుంటాడు:

"ఈ కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి సదవగాహన లేదు. బాత్రూంలో కాలుజారి పడటం, బజార్లో అత్యాచారం ఒకటే అనుకుంటోందంటే అది అతితెలివి మాత్రమే. అసలు బాత్రూంలో పడినప్పుడే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. తను మళ్ళీ పడకుండా, వాళ్ళు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాని ఇంట్లో అలాంటి వాతావరణం ఉండదు. తన పట్ల ఓవర్ కాంఫిడెన్స్. బహుశా అదే అత్యాచారానికి దారితీసి ఉంటుంది. దుర్మార్గులు చీకట్లోనే కాదు వెలుగులో కూడా దాడి చేస్తుంటారు. వాళ్ళని సమిస్టిగా ఎదుర్కోవాలి. అంతేగాని, సమస్యని వ్యక్తిగతస్థాయిలో పరిష్కరించుకుంటానని కౌస్తుభతో చెప్పించటం రచయిత తొందరపాటుతనాన్ని తెలియచేస్తుంది."

"నేను విచ్చలవిడిగా శారీరక సంబంధాలు కలిగి ఉంటే - నా శీలం పొయినట్లవుతుంది.అంతేగాని..."

ఇదేమిటి? ఒకవేళ విచ్చలవిడిగా శారీరక సంబంధాలు కలిగి ఉంటే మాత్రం శీలం పొయినట్లు ఎందుకు అవుతుంది? బహుశా, రచయితలో చైతన్యం ప్రస్తుతానికి ఈస్థాయిలో ఉందేమో!

మొత్తం పాత్రలన్నీ పైత్యమెక్కినట్టుగా ప్రవర్తిస్తుంటాయి. ఎవరిలోనూ మానసిక పరిణితి లేదు, చివరకి, రచయిత ముద్దుబిడ్డ కౌస్తుభలో కూడా.


కధ సగభాగం తర్వాత, కధావస్తువులో మార్పు వస్తుంది. అభ్యుదయ భావాలు గల స్త్రీకి బయట ఎంత ప్రమాదం ఉందో ఇంట్లోనూ అంతే ప్రమాదం ఉంది. లేదా ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి.

స్త్రీవాద రచయిత్రుల సమావేశాల్లో... " మన పోరాటం ఇంట్లోంచే ప్రారంభం కావాలి, అదీ వంటింట్లోంచి". అనే నినాదాలు వింటుంటాం.

బహుశా రచయిత ఈకధలో రెండు విషయాలు చెప్పాలనుకున్నాడు:

1. ఎవరైనా స్త్రీ మానభంగానికి గురైతే, శీలం అనే పదం వాడి ఆమెను మరింత క్షోభపెట్టకుండా, ఏదో ఒక అవయవానికి గాయమైనట్టుగా భావించాలి.

2. ఆధునిక స్త్రీకి ఇంట్లోనూ, బయటా ప్రమాదం ఉంది. ఆమె తన వ్యక్తిత్వం కోసం ఇంటా, బయటా రెండు చోట్లా పోరాడాలి.

3. రచయిత తనకా ఉద్దేశం లేనప్పటికి, మరో విషయం తెలియచేస్తాడు - సరైన జ్ఞానం, అవగాహన లేని కుటుంబంలో వ్యక్తుల సంబంధ బాంధవ్యాలు, వారి సమస్యలు, పరిష్కారాలు...

చివరకి కధ సినిమాటిక్ గా ముగుస్తుంది.

రచయితలోని అభ్యుదయవాది తాండవం చేసాడు. రచయితలోని కళాకారుడు ప్రేక్షకపాత్ర వహించాడు.

(written on 08/01/97)

No comments: