Monday, July 9, 2007

ద డి గా డు వా న సి రా

ప్రభుత్వకార్యాలయంలో
సిన్సియర్ గుమాస్తాలా
కాగితపు దొంతర ముందేసుకుని
ఏం రాయాలి?

ఏదో వ్రాయాలి, వ్రాసి
ఈభారమైన వ్యధను
దించుకోవాలి, ఈ తీపినిజం
నీతో పంచుకొవాలి

ఏవో నాలుగు మాటలు
ఎవడూ చెప్పని రీతిలో
ఎప్పుడూ వాడని పదాలతో
వ్రాయాలని తహతహలాడితే

మిడి మిడి భాషాజ్ఞానం
అంతో ఇంతో భావదారిద్ర్యం
"నువ్వూనా?" అని ఇకిలిస్తున్నాయి
పెనుభూతాలై కబళిస్తున్నాయి

ఆయినా వ్రాస్తున్నాను, ఓ
చిరువిన్నపం చేస్తున్నాను
ఇదేమి కవిత్వం కాదు
నాకేమి పైత్యం లేదు

* * *

మళ్ళీ మొదలు
ఒకటే గుబులు
ఎంతో వ్రాద్దామనుకుంటే
ఏమీ వ్రాయలేని స్థితి

సారీ నేస్తం,
క్షమించేయ్ సమస్తం
ఇందుకే అంటారా!
దడిగాడు వానసిరా!!

* * *

భావావేశాల సుడులకు
ఆర్ధిక సమస్యల ముడులు వేసి
కలలలోకి పారిపోయి
కాంతనొకతెను గాంచి
పరవశించి-

పెద్దల తప్పిదాన
ప్రకృతి వేసిన
వికృత కేకకు
ఉలిక్కిపడి-

మధ్యతరగతి వాస్తవంలో కొచ్చి
నిస్సత్తువ ఆవరించి
భాధగా నిట్టూర్చి
నవ్వే ప్రయత్నం

* * *

ఇదంతా చదివాకా
నీజీతం ఓ పిసరు కూడా పెరుగదు
బహుశా బస్సు కూడా మిస్సవ్వచ్చు

అలా అని విసుక్కోకు సుమా!
ఇది ఓ మనిషి కధ
ఇది ఓ మనసు కధ

టాల్ స్టాయ్, తుర్గెనెవ్, చెఖొవ్
వీళ్ళంతా నాకిస్టం
సాంబారు ఇడ్లీ, ఫారిన్ ఫిల్మ్, మెడిటేషన్
మరీ మరీ ఇష్టం

వివేకానంద, రామచంద్ర
ఫ్రాయిడ్, పతంజలి
..... ఇంకా చాలామంది
వీళ్ళే నాకు ఆదర్శం

* * *

ఇంతకీ ఏమిటి చెప్పాలనుకున్నాను?
ఏమో తెలియదు
నిజంగా తెలియదా?
బహుశా తెలుసేమో!

ఒక్కసారి కళ్ళుమూసుకుని
ప్రయత్నించనీ
మైగాడ్! కళ్ళుమూయగానే
రెండు పిశాచాలు దర్శనమిస్తాయి
బస్సు, ఆఫీసు

* * *

తల్లి ఒడిలో ఆనందం
రద్దీ కూడలిలో వెకిలితనం
అర్ధంగాని మెట్ట వేదాంతం
ఇదే సగటు మనిషి జీవితం

రకరకాల వ్యక్తులు
రంగురంగుల స్నేహలు
అవసరం అసలు సూత్రం
సర్ధుబాటు ముఖ్యసాధనం

కరచాలనాలు, కౌగిలింతలు
నిలువెత్తు డొల్లతనం
ఇదో జీవశ్చవాల
కరాళ నృత్యం

ఈ నీర్జీవపు వికృత
ప్రసవ సమయంలో
ఈ పగటి వేషగాళ్ళ మధ్య
ఈ ప్లాస్టిక్ చర్మంగాళ్ళ మధ్య
పదం పుట్టదు
కలం సాగదు

* * *

జీవితం యాంత్రికమైంది
యాంత్రికం వినోదమైంది
వినోదం విషాధమైంది
విషాధం గెలుపు అవుతోంది
అప్పుడప్పుడూ అలుపూ అవుతుంది

అలసిన హృదయం
ఆహ్లాద పడాలనుకుంటుంది
ఎంతో ఆత్మీయతతో
నీ దగ్గరికొస్తాను

నువ్వేదో గాభరా లాంటి
ఆనందానికి గురౌతావు
నేనేదో సంజాయిషీ లాంటి
చిరునవ్వు నటిస్తాను

మనం కాసేపు జవాబులు
తెలిసిన ప్రశ్నలు వేసుకుంటాం
నేనేదో పేల్తాను -
అనువాద చిత్రంలోని
అర్ధంకాని జోక్ లాంటిది
నువ్వు చెవుల్దాకా నవ్వి
ధీర్ఘాలోచనలో పడతావు
లేదా అలా కనిపిస్తావు

* * *

అరే నేస్తం, ఇదంతా
ఏదో అవార్డు పొందిన
చెత్త సినిమాలా ఉందికదూ?

మరోసారి మళ్ళీ కలుద్దాం
ఈసారి సరళంగా, స్పష్టంగా
వ్ర్రాయడానికి ప్రయత్నిస్తాను

* * *

నీ అల్లి బిల్లి ఊహలు
అమాయకపు ఆదర్శాలు
యవ్వన ఆశలు
లేలేత విలువలు
ఇక పరిమళించాలి

(Abridged. Written in 1994. )

No comments: