Thursday, November 29, 2007

ప్రజాసేవ

ప్రజాసేవ చేయడానికి
పదవెందుకో నాకిప్పటికి
అర్ధం కానప్పటికి

తమ శేషజీవితాన్ని
ప్రజలకే అంకితమని
ప్రమాణాలు చేస్తున్నామని

రోజూ చూస్తున్నా ఏదో ఊరేగింపు
వాడవాడలా బిచ్చగాళ్ళ గుంపు
రద్దీకూడళ్ళలో రాజకీయపు కంపు

మతం వారికి వంటచెరకు
కులమాయెను అంగడి సరుకు
దిగజారెను ఓటు కొరకు

సంపాదనే జీవితధ్యేయం
సేవాభావం కడుశూన్యం
కుర్చీయే అంతిమ గమ్యం

నిజాయితి లేదు లవలేశం
అవినీతి చేరుతోంది ఆకాశం
వినేదెవరు సామన్యుని ఆక్రోశం?

Sunday, November 25, 2007

పుస్తకావిష్కరణ సభ

నీ పుస్తకావిష్కరణ సభకొచ్చాను
ముందువరుసలో కూర్చున్న
ఇద్దరుకవులతో మాటలు కలిపాను

కవిత్వం చదువుతూ
కన్నీరు కారుస్తూ
నువ్వు పూనకంలో ఉన్నావు

ఉత్సాహాన్ని చంపుకోలేక
కొందరం బయటకు వెళ్ళి
సిగరెట్లు వెలిగించాం

రియల్ ఎస్టేటు,రాజకీయాలు
ఇటీవలే రిలీజయిన సినిమా
ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం

సగం ఖాళీ అయిన సభలో
నీభుజమ్మీది ఎర్రకండువా
బిక్కుబిక్కుమంటూ
దిక్కులు చూస్తోంది

ఎవరో యూనివర్శిటీ విమర్శకుడు
కవిత్వంలో నీశైలీ,శిల్పం
అంటూ ప్రయాస పడ్డాడు

ఓ తెల్లగెడ్డపోడు,నీ ఆలోచనలు
ఫలానా విదేశీమేధావికి దగ్గరగా
ఉన్నాయంటూ,సాక్ష్యంగా
కాగితపుదొంతర తీసి
చదవబోయాడు

వాటర్ బాటిలందించే నెపంతో
ముందుకు వంగిన మరొకడు
సమయం లేదని
త్వరగా ముగించమని
గెడ్డపోడి చెవిలో
గుసగుసలాడాడు

కడుపుతో ఉన్న నీ భార్య
కన్నుమూసినా నిబ్బరించిన నీవు
సోవియట్ యూనియన్ ముక్కలైందని
వెక్కివెక్కి ఏడ్చిన నీవు

ఎప్పుడూ ఉద్యమాల్లో ఉన్న నీవు
అప్పుడప్పుడూ ఒకటీ అరా రాసావు
నీచేతలు తెలియని వాళ్ళు
నీరాతలు ఎలా కొలుస్తారు,నాయాళ్ళు?

నువ్వు పాల్గొన్న ఉద్యమాల గురించి
నువ్వు తిన్న లాఠీ దెబ్బల గురించి
ఆసభలో ఒక్కడూ మాట్లాడలేదు

Saturday, November 24, 2007

నిరీక్షణ

నా కలలని నాటుకుంటూ
పాటలని ఏరుకుంటూ
మనం ఎపుడూ కలిసే తోటలో
నిరీక్షిస్తున్నాను నీకోసం

కబురు చెప్పమని
నేపంపిన గాలిపటమూ
ఇంకా తిరిగిరాలేదు

నెమలి కన్నులు,వాటికిమేత
పుస్తకాలలో నేదాచుకున్న
నా యావదాస్తీ పెట్టి
కొన్న పతంగమది

కూనిరాగం తీస్తూ
ప్రతీపూవును పలకరిస్తూ
పరుగులెడుతోంది గాలి

నీ అధరాల రాపిడిలో
రాలిన పుప్పొడి
వెదజల్లుతున్న పరిమళం
సంచినిండా నింపుకుని
రహస్యంగా పంచుతున్న గాలి

వాస్తవంలోకి నువ్వు కలలాగ వచ్చి
కలలోన వాస్తవం అవుతావు
మనం ఎపుడూ కలిసే తోటలో
నిరీక్షిస్తున్నాను నీకోసం

Friday, November 23, 2007

రాజకీయ పద్యాలు

ఆంధ్రరాష్ట్రంలో జరుతున్నాయి తరుచుగా బందులు
శవాలకై వెదుకుతున్నాయి రాజకీయ రాబందులు
చైతన్యంతో ప్రశ్నించాలి అణగారిన గొంతులు
రాజ్యాధికారంలో పొందాలి సమాన వంతులు

అగ్రవర్ణాల దోపిడి,నువ్వు ఎపుడూ చెప్పే కధ
నీకులంవాడే నిన్ను దోచుకోవడం నేటి విషాధగాధ
దోపిడీవర్గానిది ఎపుడూ ఒకటే కులం
పంచుకు తింటుంది అభివృద్ధి ఫలం


మన రాజ్యాంగానికి ఉడిగాయి జవసత్వాలు
కొనసాగుతున్నాయి ఫత్వాలు,రిజర్వేషన్ వారసత్వాలు
ఇదేనా సామాజిక న్యాయం? ఎన్నాళ్ళీ ఓటు రాజకీయం?
స్రవిస్తున్న ఈ గాయం,పాడుతోందీ గేయం


తరచిచూసిన కొందరు నాయకుల గతమంతా
ఉండును నేరచరిత ఎంతోకొంత
వారు పాతకేడీలు, వీధి రౌడీలు
అభినవకీచకులు,జగత్ కిలాడీలు

పదవిపై ఎంతో ఉబలాటం
పగలూ రాత్రీ అదే ఆరాటం
విడిపోవాలంటూ ఒకటే ఉన్మాదం
ఏమౌతుందో ఈ ఉమ్మడి సౌధం!

ఓటుకోసమొచ్చిన ప్రతీసారి
నోటికొచ్చిన వాగ్ధానమల్లా చేస్తావు
సీటుగెల్చిన మత్తులో గతాన్నే మరుస్తావు
మాబ్రతుకులు చేస్తున్నాయి బొమ్మగుర్రం సవారి

ఇంకా ఎన్నాళ్ళో పాలెగాళ్ళ పాలన!
వలుచుకున్నది చాలదా ఓ దుశ్శాసన
వినబడుతున్నదా మన తెలుగుతల్లి రోధన?
కొంచెమైనా చేసుకో నీ ఆత్మశోధన!

దేశంలో తీవ్రవాదం మరలా నిద్రలేచింది
మతంపేరుతో వికృతంగా ఆవలించింది
అమాయకుల ప్రాణాలు ఫలహారించింది
ప్రజాస్వామ్యానికి సవాలుగ నిలిచింది

జర్నలిజం పడుతోంది అడ్డదారి
సంచలనాలకోసం వెదికింది దొడ్డిదారి
దీనికన్న నయం గ్రామాల్లోని చాటింపు
ఈవిపరీతధోరణికి రావాలి ఇక ముగింపు

Tuesday, November 20, 2007

అమెరికా పద్యాలు

తుమ్మిన చెప్పెదరు బ్లెస్ యూ
బదులు చెప్పవలె థ్యాంక్యూ
ఎంతో ముఖ్యం అమెరికాలో మేనర్సు
వింటున్నావా మైడియర్ అభిలాషు

వారాంతంలో స్వదేశీ విందులు
నోరూరించే భలే పసందులు
వేస్తారు సినిమాపాటలకు చిందులు
జారతాయి పైజమా బొందులు

వింటావా మరికొన్ని గమ్మత్తులు?
నిత్యం తింటారు కేకూ బిస్కత్తులు
మరి దేహానికి ఎలా మరమత్తులు?
చేస్తారులే తెగ కసరత్తులు

రోజూ ఏదో ఒక ఊరించే డీలు
పెరుగును మన కొనుగోలు
వలుచును చివరకి మన తోలు
ఎంతో మేలు చాపకింద తేలు

అంతులేని ఆశలు,అర్ధంకాని భాషలు
అందివచ్చిన అవకాశాలు, తెస్తున్నాయి నిషాలు
మారును మన వేషాలు, పెరుగును రోషాలు
పరిగెడుతుంటాయి నిమిషాలు

ఈదేశంలో ప్రేమ ఎంతో కరువు
తెలియదు భాధ్యత-బరువు
ఎటుచూసినా స్వార్ధపు బ్రతుకు తెరువు
ఈ స్వేచ్చ ఓ గట్టుతెగిన చెరువు

మాతృభాష జీవితపు వెలుగు
ఆలోచనలకు స్పష్టత కలుగు
మరువరాదు మన తీయని తెలుగు
మరిచినవాడు ఓ నడిచే పీనుగు

త్వరగా వెలగదు తడిసిన పుల్ల
నిర్లక్ష్యంతో ఓడింది కధలో కుందేలు పిల్ల
కృషితోనే కదా వచ్చును యశస్సు
విజేతగా సదా నిలవాలి అభిలాషు