Sunday, November 25, 2007

పుస్తకావిష్కరణ సభ

నీ పుస్తకావిష్కరణ సభకొచ్చాను
ముందువరుసలో కూర్చున్న
ఇద్దరుకవులతో మాటలు కలిపాను

కవిత్వం చదువుతూ
కన్నీరు కారుస్తూ
నువ్వు పూనకంలో ఉన్నావు

ఉత్సాహాన్ని చంపుకోలేక
కొందరం బయటకు వెళ్ళి
సిగరెట్లు వెలిగించాం

రియల్ ఎస్టేటు,రాజకీయాలు
ఇటీవలే రిలీజయిన సినిమా
ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం

సగం ఖాళీ అయిన సభలో
నీభుజమ్మీది ఎర్రకండువా
బిక్కుబిక్కుమంటూ
దిక్కులు చూస్తోంది

ఎవరో యూనివర్శిటీ విమర్శకుడు
కవిత్వంలో నీశైలీ,శిల్పం
అంటూ ప్రయాస పడ్డాడు

ఓ తెల్లగెడ్డపోడు,నీ ఆలోచనలు
ఫలానా విదేశీమేధావికి దగ్గరగా
ఉన్నాయంటూ,సాక్ష్యంగా
కాగితపుదొంతర తీసి
చదవబోయాడు

వాటర్ బాటిలందించే నెపంతో
ముందుకు వంగిన మరొకడు
సమయం లేదని
త్వరగా ముగించమని
గెడ్డపోడి చెవిలో
గుసగుసలాడాడు

కడుపుతో ఉన్న నీ భార్య
కన్నుమూసినా నిబ్బరించిన నీవు
సోవియట్ యూనియన్ ముక్కలైందని
వెక్కివెక్కి ఏడ్చిన నీవు

ఎప్పుడూ ఉద్యమాల్లో ఉన్న నీవు
అప్పుడప్పుడూ ఒకటీ అరా రాసావు
నీచేతలు తెలియని వాళ్ళు
నీరాతలు ఎలా కొలుస్తారు,నాయాళ్ళు?

నువ్వు పాల్గొన్న ఉద్యమాల గురించి
నువ్వు తిన్న లాఠీ దెబ్బల గురించి
ఆసభలో ఒక్కడూ మాట్లాడలేదు

No comments: