Tuesday, November 20, 2007

అమెరికా పద్యాలు

తుమ్మిన చెప్పెదరు బ్లెస్ యూ
బదులు చెప్పవలె థ్యాంక్యూ
ఎంతో ముఖ్యం అమెరికాలో మేనర్సు
వింటున్నావా మైడియర్ అభిలాషు

వారాంతంలో స్వదేశీ విందులు
నోరూరించే భలే పసందులు
వేస్తారు సినిమాపాటలకు చిందులు
జారతాయి పైజమా బొందులు

వింటావా మరికొన్ని గమ్మత్తులు?
నిత్యం తింటారు కేకూ బిస్కత్తులు
మరి దేహానికి ఎలా మరమత్తులు?
చేస్తారులే తెగ కసరత్తులు

రోజూ ఏదో ఒక ఊరించే డీలు
పెరుగును మన కొనుగోలు
వలుచును చివరకి మన తోలు
ఎంతో మేలు చాపకింద తేలు

అంతులేని ఆశలు,అర్ధంకాని భాషలు
అందివచ్చిన అవకాశాలు, తెస్తున్నాయి నిషాలు
మారును మన వేషాలు, పెరుగును రోషాలు
పరిగెడుతుంటాయి నిమిషాలు

ఈదేశంలో ప్రేమ ఎంతో కరువు
తెలియదు భాధ్యత-బరువు
ఎటుచూసినా స్వార్ధపు బ్రతుకు తెరువు
ఈ స్వేచ్చ ఓ గట్టుతెగిన చెరువు

మాతృభాష జీవితపు వెలుగు
ఆలోచనలకు స్పష్టత కలుగు
మరువరాదు మన తీయని తెలుగు
మరిచినవాడు ఓ నడిచే పీనుగు

త్వరగా వెలగదు తడిసిన పుల్ల
నిర్లక్ష్యంతో ఓడింది కధలో కుందేలు పిల్ల
కృషితోనే కదా వచ్చును యశస్సు
విజేతగా సదా నిలవాలి అభిలాషు

No comments: