Saturday, November 24, 2007

నిరీక్షణ

నా కలలని నాటుకుంటూ
పాటలని ఏరుకుంటూ
మనం ఎపుడూ కలిసే తోటలో
నిరీక్షిస్తున్నాను నీకోసం

కబురు చెప్పమని
నేపంపిన గాలిపటమూ
ఇంకా తిరిగిరాలేదు

నెమలి కన్నులు,వాటికిమేత
పుస్తకాలలో నేదాచుకున్న
నా యావదాస్తీ పెట్టి
కొన్న పతంగమది

కూనిరాగం తీస్తూ
ప్రతీపూవును పలకరిస్తూ
పరుగులెడుతోంది గాలి

నీ అధరాల రాపిడిలో
రాలిన పుప్పొడి
వెదజల్లుతున్న పరిమళం
సంచినిండా నింపుకుని
రహస్యంగా పంచుతున్న గాలి

వాస్తవంలోకి నువ్వు కలలాగ వచ్చి
కలలోన వాస్తవం అవుతావు
మనం ఎపుడూ కలిసే తోటలో
నిరీక్షిస్తున్నాను నీకోసం

2 comments:

శ్రీ said...

కలలను నాటుకుంటూ, పాటలను ఏరుకుంటూ.... చాలా బాగుంది కవిత. మీ పద్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.....

ధన్యవాదాలు
శ్రీ

Rama Prasad said...

చాలా బాగుంది !