Sunday, July 15, 2007

పగటికలలు - a bachelor's sketch

సుమారు ఉదయం నాలుగు గంటలకి మెలకువ వచ్చింది, సిస్టర్ కిచెన్ లో లైట్ వేయడం వలన. మరలా ముసుగు తన్నాను. టాల్ స్టాయ్ బ్రయోగ్రఫీలోని విషయాలు గుర్తుతెచ్చుకోసాగాను. కాని A గుర్తుకొచ్చింది. ఆమె తలపులని విదిలించుకుని రస్సెల్ గురించి ఆలోచించసాగాను. అప్రయత్నంగానే కలలోకి జారాను. నేను B ఒడిలో ఉన్నాను. బిగి కౌగిలి, ముద్దులు... ఒక ప్రేక్షకుడిలా నా కల్పిత కలను వీక్షించాను. మనసు చేసే ఈగారడీల నుండి బయటపడేసరికి ఆరు గంటలు దాటింది.

ముఖం కడుక్కుని టిఫిన్ చేసాను. టీ అయిన తర్వాత, టాల్ స్టాయ్ బ్రయోగ్రఫీలో రెండు చాప్టర్లు చదివాను. స్నానం చేసి, రస్సెల్ ని వెట్టబెట్టుకుని లైబ్రరీకి బయలుదేరాను. బెర్ట్రాండ్ రస్సెల్ నా కొత్త గురువు. వివేకానంద, శ్రీశ్రీ, రామచంద్ర... వీరిని ఎంతగా ఆరాధించానో, రస్సెల్ ని అంతగానే ఆరాధిస్తున్నాను. బహుశా కొన్ని నెలలు రస్సెల్ నా ఆధ్యాత్మిక గురువు.

బస్సు బయలుదేరటానికి ఇంకా సమయం ఉంది. నేను సీట్లో కూర్చోగానే, రెందు సీట్లు ముందు కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు వెనక్కి తిరిగి చూసారు. ఇద్దరిలో పెళ్ళికాని అమ్మాయి నావంక `తేరిపార` చూసింది లేదా నాకలా అనిపించింది. నేను ప్రశాంతంగా, చిరునవ్వుతో(కొంత ప్రయత్నంతో) ఆమె వంక చూసాను. ఆమె వెంటనే తలతిప్పేసుకుంది, ఎవరో చర్చి ఫాథర్ ని చూసినట్టుగా.

నేను, `The Conquest of Happiness` తీసి రెండు పేరాలు చదివి, అందులోని విషయాలను గురించి ఆలోచించసాగాను. ఎప్పట్లాగే ఏదైనా విషయం అర్ధమైనపుడు, లేదా అర్ధమైందని అనిపించినప్పుడు, కలిగే ఆనందాన్ని అనుభూతి చెందాను.

కొంతమంది ఎప్పుడూ చదువుతూనే ఉంటారు; తమ మిత్రబృందంలో ప్రత్యేక గుర్తింపు కోసమో, లేదా అదేదో ఘనకార్యమని భావించడం వలనో. ఒకాయన దొంగదగ్గులు దగ్గి, తన ఎర్రబడ్డ కళ్ళను మిత్రులు గమనించేలా కళ్ళజోడు తీసి, ఇలా అంటాడు: " పడుకునే సరికి ఉదయం మూడయింది. డికెన్స్ ని చదువుతూ టైం మర్చిపోయాను."

కొంతమంది ఎప్పుడూ రాస్తూనే ఉంటారు; తాము రాయడానికే పుట్టామని, అయినా సరిగా రాయలేక పొతున్నామని వాపోతుంటారు. పరిసరాల నుండి, ప్రతీ కదలిక నుండి కధావస్తువుల కోసం వెంపర్లాడతారు.


చదవటానికి, రాయటానికి మధ్యలో మరో క్రియ ఉంది; ఆలోచించటం. ఇది నిజంగా అధ్భుతమైంది, కష్టమైంది.

ఆ అమ్మాయి మరలా వెనక్కి తిరిగింది. "ఫాథర్ నేను అందంగా ఉన్నాన్నా?", అన్నట్టుగా చూసింది.

"నువ్వు అందంగానే కాదు, ఆరోగ్యంగా కూడా ఉన్నావు. కాని నన్ను చర్చి ఫాథర్ లా చూడటం సబబుగా కాదు. ఈ ఉదయాన్ని నాకొచ్చిన కల నీకు తెలిస్తేనా!...", కొంటెగా చూస్తూ కళ్ళతోనే జవాబిచ్చాను.

నాకు మరల ఆ కల గుర్తొచ్చింది. గుండెల్నిండా గాలి పీల్చీ, `ఊఫ్ ఫ్` అని నిట్టూర్చి, `అన్నింటికన్నా తేలికైన పని - పగటికలలు కనడం`, అనుకున్నాను.



(written in 1996)

1 comment:

Anonymous said...

మీ బ్లాగు చాలా బాగుంది. దీనిని జల్లెడ(http://jalleda.com)కు కలపడం జరిగినది.