Thursday, June 3, 2010

అవతారం

హైదరాబాద్, కె.పి.హెచ్.బి.కాలని. బస్టాండ్.
పగలు. పాన్ షాప్ దగ్గర, ఇద్దరు స్నేహితులు కబుర్లాడుతున్నారు. సిగరెట్లు పొగలొదులుతున్నాయి.
"ఇంకేటీ,సంగతులు?"
"అవతారం సార్ తెలుగు పూత్తిగా మర్సిపోయినాడంట?"
"కొంపతీసి ఆళ్ళబ్బాయి సుబ్బిగాడు అమెరికాలో సెటిలయిపోయాడేటి?"
"దానికీ దీనికీ సంబంధమేటేహే?"
"సంబంధమేటా?",(పెద్దగానవ్వు) "...తింగరినాకొడకా!"
"సెప్పరాదేటి?"
"మన కాలనీలో ఎంతమంది పోరగాళ్ళు అమెరికా ఎల్లలేదు! ఆళ్ళు ఎల్లంగానే, ఇక్కడ అమ్మాబాబులు ఎంతమంది తెలుగు మర్సిపోలేదు!"
"అవతారం సార్ ఏరెహె"
"ఓరెర్రి పప్పా! నీకన్నా సలీం గాడు నయంలాగుంది."
"ఆ కిరాయి కారోడా?"
"ఈ కాలని ముసలోళ్ళకి ఆడే కదేటి,డ్రయివింగులు నేర్పేది! వోరే తెల్సా? ఈ ముస్లోడికి ఒకప్పుడు సైకిలు తొక్కడం కూడా రాదు."
కోపంగా, "ఏ ముసలోడు?"
నోట్లోని సిగరెట్టు తీసి పళ్ళసందుల్లోంచి ఉమ్ముతూ, "నీయక్క, అవతారమెహె!"
పిడిగిలి బిగిస్తూ, "నాయాలా! మాటలు జాగత్తగా రానీయ్".
"నీకేటయిందిరా? ఓ తెగ పీలయిపోతన్నావ్?"
"ఆ సార్ మాకు తెలుగు పంతులు"
"ఎప్పుడూ?!"
"ఇస్కూల్లో"
"తెలుగు పంతులు, తెలుగు మర్సిపోతమేటిరోయ్!!"
"మరదే కదరా నేన్ సెప్పేది, ఎడ్డినాకొడకా!"

* * *

కాలనిలో ఓ ఇల్లు. రాత్రి.
బెడ్రూంలో మంచంపై భార్యకై ఎదురుచూస్తూ - చేతిలో కాలక్షేపం పత్రిక - శృంగార కధలో బొమ్మని చూస్తూ,కూనిరాగం...
"హే కాపుకొస్తే ...ఉహుహూ హుహూ...జాము కొస్తే....ఉహుహూ హుహూ...."
"విన్నారా?",డోర్ కి గడియ పెడుతూ, అంది భార్య.
"హేమిటి?" ( పళ్ళికిలుస్తూ)
"అవతారం గారు తెలుగు మర్చిపోయారట?"
"నీదాకా వచ్చిందా వార్తా?", విసుగ్గా అన్నాడు. "పనికిమాలిన సంగతులన్నీ దీనికే కావాలి" (స్వగతం)
భార్య - మంచం మీదకి వాలుతూ...
"ఇలా వారపత్రికలు తిరగేసే బదులు, ఏ జావా పుస్తకాలో చదివితే, మనమూ అమెరికాలో ఉండేవాళ్ళం"
భార్య కాళ్ళ మీద కాలు వేస్తూ...
"ఇంకా అమెరికా ఏమిటే పిచ్చిమొహమా! అక్కడి కంపెనీలు ఇక్కడికొస్తున్నాయి. అక్కడి పిజ్జాలు ఇక్కడ దొరుకుతున్నాయి", అన్నాడు.
"ఆ ఎప్పుడు తిండి గొడవే. ఇంకా కారు నడపడం రాదు. కనీసం పాస్ పోర్ట్ కూడా లేదు"
"ఈ రాత్రి కూడా వృధాయేనా, వాత్సాయనా! ...ఆ టైమొస్తే మనమూ వెళ్తాం".
"రేపు ఈవీధి ఆడవాళ్ళం వెళ్తున్నాం,"
"అమెరికాకే?"
"అంతసీన్ లేదులేండి. అవతారం గారి భార్యని పలకరించటానికి".
"అంతగా విషమించిందా?"
"బ్రెయిన్ స్కేనింగులూ గట్రా తీసారుట."
"భూతవైధ్యుణ్ణి పిలవాల్సింది."
"మీకు విషయం పూర్తిగా తెల్సినట్టులేదు. తెలుగు అనే భాష ఉన్నట్టే ఆయనకి గుర్తులేదట."
"గూబలమీద ఓరెండు పీకితే, 'అమ్మా' అని అరవడేమిటే?"
"మీకంతా వేళాకోళమే? పాపం,ఏదో కొత్తరకం జబ్బట."
"అయినా ఆయనకి మానేసి, ఆయన భార్యకి పలకరింపులేమిటి?"
"ఆయన్ని పలకరించాలంటే ముదనష్టపు ఆగ్లం రావాలి కదా! ఈ మధ్య జంతుజాలంతో కూడా ఆంగ్లమేనట"

* * *

కాలనిలో అవతారం గారిల్లు. రాత్రి.
పెరటి ప్రహారి - చెక్క ఫెన్సింగ్ దగ్గర - అవతారం గారి పెప్పుడు కుక్క లూసి. అటువైపు వెనకింటి వారి కుక్క డాలి.
"గంటనించి బాతాఖాని కొడుతున్నా... ఆళ్ళ సార్ గురించి ఒక్కముక్కా సెప్పదేటో!",డాలి మనసులో అనుకుంది. తనంతట తనే ఎందుకు అడగడం అని ఇంతసేపూ ఆగింది. చిన్నగా దగ్గి…
"పక్కవీధి పిల్లి సెంద్రిని, మీసార్ ఏదో అన్నాడంట?",అడిగింది డాలి.
"అదో గలీజుది! ఈ మనుషుల్లో ఉండే అవలచ్చనాలు కొన్ని దానికీ అబ్బినట్టున్నాయి... మా యజమాని గురించి ఏమైనా కూసిందా?"
"మొన్న దావతయి మీవంటింట్లో దూరితే, మీ సార్ ఏదో భాషలో అరుత్తానే ఉన్నాడంట. ఆ తిట్లు సంజవక బేజారెత్తిందట."
"ఇంకేం కూసిందా నంగనాచిది?"
"మీ ఇంట్లో ఇక ఎంగిలిపడనని వట్టేసుకుందట,అందరకి సెప్తా ఉంది. అవునే...మీ సార్ కి ఏదో జబ్బంట, నిజమేనా?", భయంగానే డాలి అడిగింది.
"మా ఇంటిపరువు తీయాలని సూత్తాందా...ఆ బజారు లంజ?", కోపంగా అరిచింది లూసి. కాసేపు మౌనంగా ఉండిపోయి, భారంగా నిట్టూర్చి...
"మా యజమాన్నేదో పట్టింది. ఏదో బెమల్లో ఉన్నోడిలా...అదే సొల్లు వాగుడు. వమెరికా అన్న ముక్కోటే తెలస్తా ఉండాది."
"రోజంతా టీవీలో అయ్యే సూత్తాడంట?"
"కిందటేడు వమెరికాలో ఎవరో పేరున్న పాటగాడు పోయాడంట,రెండు దినాలు కూడు తింటం బంద్ సేసిండు."
"మీ సారుకి అతని పాటలంటే అంతిష్టమా?"
"పాటలెప్పుడు ఇనలేదు".
"మరి తిండెందుకో మానేయడం?"
"అదో ఎర్రితనం."
"మొన్న వారం,మీ సారు పోయాడన్నట్టుగా, గొల్లుమన్నదెవరే?", ధైర్యం చేసి అడిగేసింది డాలి.
"ఈ సంగతి నీదాకా వచ్చిందా!", అని నొచ్చుకుంది లూసి. "మన తండ్రులు వేరైనా, ఓతల్లికి పుట్టిన వాల్లమని ఇయ్యన్నీ సెపుతున్నాను,ఎక్కడా వాగమాక!", అని లూసి చెప్పసాగింది…
"అగ్రహారం నుండి ఆయన ఇద్దరప్పలూ వచ్చి ఉన్నారులే. అవతారం గారు నిద్రలో ఏదో సణగతా ఉంటే,ఆ భాష అర్ధంగాక,`సంధి పేలాపన` అనుకుని కిందపడుకోబెట్టి,సెరోపక్కా కూకుని శోకన్నాలు మొదలెట్టారు. ఏదుపులకి మెలకువ వచ్చి,వారిని ఆపమని సెప్పటానికి పెయత్నింతే, ఆయన నోట్లోంచి ఒక్క తెలుగుముక్కా రాదాయే.", లూసి చెప్పటం ఆపి ముక్కు చీదింది.
"ఆయాల్టి నించి ఆయన తెలుగన్నది పూత్తిగా మర్సిపోనాడు. ఎంతలా గింజుకున్నా, అదేటి ఇంగిలిపీసంట,అన్నీ ఆ కూతలే వత్తన్నాయి..." అని కళ్ళల్లో నీరు ఉబుకుతోంటే, లూసి తల పక్కకి తిప్పుకుంది.
ఫెన్సింగ్లో తన ముఖాన్ని దూర్చి, బలవంతాన నవ్వాపుకుంటూ...
""మనయి తెలుగు పేర్లేటే?", ఆటపట్టించటాని కన్నట్టుగా అంది డాలి.
"ఈ మనుసుల్ని, శానా వాటికి మనం సెమించేయాలి!",నవ్వుతూ అంది లూసి.

Monday, May 24, 2010

అమెరికాలో తెలుగు రాకుమారి

అమెరికాలో నువ్ కాల్పెట్టిన
అలనాటి నుండి నేటిదాకా
'డీల్స్' అంటూ వేలం వెర్రిగా
మాల్స్ చుట్టూ పరుగులెడుతూ

కొనితెచ్చిన ఆచెత్త నంతన్
ఇంటినిండా కొలువు పెట్టినా
ఇంకేదో కొన్లేదని,కలతచెందుతూ
భర్తేదో అన్నాడని,కన్నీరొలుకుతూ

సాతానుకి ఆత్మను తాకట్టు పెట్టిన
పాతకధలోని రాకుమారి వలే,
ఈ వినియోగ మాయా ప్రయోగశాలలో
వస్తువ్యామోహంలో పడికొట్టుకుంటూ

నాడు కాలేజీరోజుల్లో మేరీజీలపై
నువ్వు దంచిన ఉపన్యాసాలు,
భావి జీవితంపై రాసిన వ్యాసాలు
ఇస్టులతో చేసిన సాహితీ గోష్టులు...

ఆపాతజీవితపు ఆకస్మిక జ్ణాపకాలలో
నీరూపాన్ని నువ్వే పోల్చుకోలేక
నీ గమనమెటో తేల్చుకోలేక
నువ్వు పడుతున్న నరకయాతన
నీలో రాబోయే మార్పుకి చిన్నసూచన

Thursday, May 20, 2010

బ్లాగు భారతం

నీవైన కొన్ని అనుభవాలను
నలుగురితోనూ పంచుకోవాలని
బ్లాగిన ఒకట్రొండు పేజీల రాతలకి
వావ్! కేజీలలో కామెంట్ల వాతలు

విదేశీ సీమలో,స్వదేశీ భాషలో
నువ్వేదో ఉగ్గూ,ఉంగా అని రాస్తే
వాడేమో వస్తువు,శిల్పం అని సణుగుతూ
అనుభూతిలేదు రచనలో పో,అంటాడు

చరుచుకుంటూ తమ జబ్బలు
విమర్శకులు పెట్టుకునే పెడబొబ్బలు
బ్లాగ్లోకంలో నువ్వూహించని ఫన్
నవ్వి నవ్వి నీ కడుపు నొప్పెట్టున్

భావవ్యక్తీకరణ నీ జన్మహక్కు
బ్లాగే అవకాశమే ఒక పెద్దలక్కు
రాయడం ఎన్నడూ మరువకోయి
ఉందిలే అందులో కొంత హాయి

Wednesday, May 19, 2010

మౌనానికి ధ్యానానికి మధ్య...

గురకలు కొడుతోంది ఊరు
ఊరుచివర పాతకాలపు ఇల్లు
ఇల్లంతా రంగులలో చిత్రాలు
ఒళ్ళంతా కళ్ళతో,స్వప్నిస్తూ వాడు

సంజీవిని తెస్తున్న మారుతి
వెన్నెల్లో స్నానిస్తున్న ప్రకృతి
నిద్రలో పైటజారిన యువతి
ఎన్ని గీసినా,ఏదో వెలితి

మనసు తట్టిన అలికిడి
గుండెలోతుల్లో అలజడి
నావ తీరం చేరేదెన్నడో?
కల చిత్రంగా మారినప్పుడు!

మొలకెత్తిన తన కలను
హత్తుకుని,తలకెత్తుకుని
మైకంతో, మమేకంతో
మరోబొమ్మ గీయడం మొదలెట్టాడు

Thursday, May 13, 2010

లవ్ ఇన్ మిచిగన్ -2

తొలకరి జల్లుల పలకరింతలతో
మదిలో ఎన్నెన్ని పులకరింతలో!
మాజీప్రియుడి తాజా జ్ణాపకాలు
చినుకులు మేనుని తాకినంతలో!

చిందులేయగా ఆకాశం ఉరిమి
ముద్దులు లంచమీయను భూమి
వేయంగానే మబ్బుల పరదాలు
భూమ్యాకాశాల మోటు సరసాలు

కప్పుకున్నా వృక్షాలతో వక్షోజాలను
దాచలేక నక్షత్రకాంతిలో,నఖక్షతాలను
తెగసిగ్గుపడును పాపం భూమి!
కమ్ముకొనును ఆకలితో ఆకాశం.

విరహం రేగును ప్రతిహృదిలో
ఊహలు ఊగును ఊయలలో
ఎవరు విసిరేనో ఈవలపు బాణాలు?
ప్రకృతికిపుడు పురిటి స్నానాలు!

Wednesday, May 12, 2010

ఒంటరి గీతం

నాటకం ముగిసింది. చప్పట్ల మోత.
వేషం తీయకుండా, తెరవెనుకే తచ్చాడుతున్నాను.
కాసేపట్లో,మళ్ళీ ఒంటరినౌతాను.

నాటకం ముగియటమంటే, రోజువారీ రొచ్చులోకి జారడం!
అప్పుడు నాకు మరో పేరుంటుంది, కులం కూడా.
బతకటానికి ఏవేవో చేస్తుంటాను.

ఏదో అర్ధంగాని గుండెకోత. భరించలేని ఉక్కపోత.
డైలాగులూ ఉండవు, అనుభూతులూ ఉండవు.
నాదికాని లోకంలో, దారితప్పిన బాటసారిని.

అభిమాన పాత్రలను ఆవాహన చేస్తూ
ఆత్మవంచన నుండి సత్యాన్వేషణ దిశగా
మళ్ళీ జీవించడానికి సన్నద్ధమౌతుంటాను.

Tuesday, May 4, 2010

నవలా సార్వభౌమా!

తరగతి గదిలోకి పరధ్యానంలా
తిరునాళ్ళలోని కక్కుర్తిలా
ఇలా వచ్చావేం నవలాసార్వభౌమా?

వారపత్రికలలో నీవు జరిపిన
సాహిత్యరతితో జన్మించిన
భూతవైద్యుల్,కుహానా మేధావులన్
చూసిపోదామని వచ్చావా?

పరిశోధనంటావు,పరిశీలనంటావు
అసలే సినీ కామెర్ల రోగివి నీవు
అందునా విదేశీ పైత్యాన్ని
పధ్యంగా మొదలిడినావు

గ్రంధచౌర్యంలో నువ్వు సవ్యసాచివి
ఏ ఎండకా గొడుగుపట్టే నంగనాచివి
నీరచనలతో వచ్చేను మెదళ్ళకు వాపు
నీజబ్బలకు లేదయ్యా ఎన్నడూ అలుపు

( శ్రీశ్రీ శరచ్చంద్రిక ప్రభావంలో.. 90లో అల్లినది. )

Friday, April 30, 2010

లవ్ ఇన్ మిచిగన్

వెర్రిగా ప్రేమించేది వాణ్ణే
దోబూచులాడే ఆ సూరీణ్ణే
రగిలితే వాడిలో కామం
కరిగి నీరవుతుంది హిమం

శిఖలో రంగురంగుల ఆకులు
రవికలో పూవుల బాకులు
వసంతమొక నెరజాణ
మీటును హృదయవీణ

గాయాలకు తేనె పూసుకుని
గేయాలను పదును పెట్టుకుని
పాత ప్రేమికుల కొత్త ప్రమాణాలు
విరామంలేని ధీర్ఘ చుంబనాలు

తొలిప్రేమలో దాటలేని ఆ హద్దులు
మోహంలో తీరును పాత పద్దులు
కుట్రలు ఎన్నో చేయును ప్రకృతి
ప్రేమతో నిండును ఈ జగతి

Friday, April 16, 2010

హార్బర్ స్ప్రింగ్స్ - ఒక మధుర స్మృతి














ఎన్నో కోరికలతో వెళ్ళావు,ఒక యాచకుని వలే.
'దేహీ' అనుకున్నప్పుడల్లా నీ శరీరంపై ఒక అదృశ్యమైన ముద్ర.
పాతకోరికలు తీర్చుకునేసరికి కొత్తవి పుడుతున్నాయి.
కోరికలతో జీవితం యాంత్రికం అయింది. ముద్రలతో చర్మం బండబారింది.

















ఎప్పట్లానే తెల్లారింది, మరలా అదే స్వార్ఢపూరిత ప్రార్ధన.
సిగ్గుపడి,మధ్యలోనే ఆపేసావు.
మిత్రులంతా ఇంకా గాఢనిద్రలో ఉన్నారు.
నిశ్శబ్దంగా బయటకు నడిచావు, ఫ్రకృతిలోకి.


















ప్రకృతి ఒడిలో పరవశం, తామసాన్ని కొంచెం కరిగించింది.
ఏదో శూన్య స్థితి,ఒక అవ్యక్తానుభూతి నిన్నావరించింది.
ఒక సుదీర్ఘ కాలం తర్వాత, నీ ప్రయత్నం లేకుండానే,
యాంత్రిక జీవిత కుబుశం కొద్దిగా రాలింది.




















నీ జీవన యాత్రలో అదొక అందమైన మజిలి.
మరి చాన్నాళ్ళుగా నిన్ను వేధిస్తున్న ప్రశ్నలు?
అక్కడ నీకు ఉనికి లేదు, ప్రశ్నలూ లేవు.
ఫ్రకృతిలో నీవు. నీలో ప్రకృతి.

Saturday, March 13, 2010

బిజీ జీవితం

బిజీబిజీ జీవితం
జీవితం గజీబిజీ
గజీబిజీ,రాజీరాజీ
రాజీపడ్డ జీవితం

రాజీపడ్డ జీవితం
జీవితం ఓపంజరం
పంజరంలో రెక్కలాడిస్తున్నగతం
గతాన్ని శిలువేసుకున్నజీవితం

గతాన్ని నెమరేస్తున్నజీవితం
జీవితాన్ని మోస్తున్న స్వగతం
స్వగతంలో కరుగుతున్న స్వప్నం
స్వప్నాలుడిగిన జీవితం

బిజీబిజీ జీవితం
రాజీపడ్డ జీవితం
గతాన్ని మేస్తున్నజీవితం
స్వప్నాలుడిగిన జీవితం

Thursday, March 11, 2010

నాడు - నేడు

ఆలోచనల నుండి ఆశయాలు
ఆశయాల సాధనకు ఉద్యమాలు
ఉద్యమాల సాఫల్యానికి త్యాగాలు
నాడు చదువుకున్న చరిత్ర పాఠాలు

ఆలోచనలని మింగేస్తున్న ఆవేశాలు
ఆవేశాలు ముదిరి ఉన్మాదాలు
ఉన్మాదంతో రాలిపోతున్న జీవితాలు
నేడు చూస్తున్న చేదు వాస్తవాలు

Wednesday, March 10, 2010

నాయకుడు

రోజూ వాడొక పెగ్గేసుకుని
తల తెగ్గోసుకుంటానంటాడు
తలలు తెగుతూనే ఉన్నాయి
వాడు వాగుతూనే ఉన్నాడు

ఓ తమ్ముడు ఉరేసుకున్నాడు
మరో మిత్రుడి జాడలేదు
మనోళ్ళంతా చీల్చబడ్డారు
మనలో కొందరు కాల్చబడ్డారు

శవాల్ని కావిలించుకుని
వాగుతూనే ఉన్నాడు
రోజూ వాడొక పెగ్గేసుకుని
తల తెగ్గోసుకుంటానంటాడు

Friday, March 5, 2010

మా ఊరి రైలు

కంపార్ట్ మెంట్ మెట్లపై పెట్టి ఒక కాలు
చెప్తుండగా నా మిత్రులకి వీడ్కోలు
సుయ్ మని వేసేవాడు గార్డు విజిలు
ఖయ్ మని కూస్తూ బయలుదేరేది మా ఊరి రైలు

అందరకీ కావాలి కిటికీ దగ్గర సీటు
(విసర్జనకి లేచావో పడిందే వేటు)
సంపాదించాకా ఆపక్కన చోటు
బయటకు చూస్తే ప్రకృతి భలే క్యూటు

చదువుతుండగానే కమ్మని కధలు
కమ్ముకొచ్చేవి తీయని కలలు
కధలలో నేమెచ్చే కొన్ని పాత్రలు
కదలివచ్చేవి ఆ యాత్రలలో!

పూసలమ్మే ఓముసలి సాయిబు
మాసినగుడ్డల ఆ నిత్యగరీబు
తృప్తిపడటంలో వాడే నవాబు
కర్మయోగానికి కాదా కితాబు?

తత్వాలు పాడేవాడొక సాధువు
తన మనసే దేవుని కొలువు
ప్రశాంతతకి అతనొక నెలవు
ఆసన్నిధిలో దేనికీ వెరవవు

వేణువూదిన ఓ గుడ్డి భిక్షువు
ఏడుపాపును ఒడిలోన శిశువు
ఏతల్లిచూపినా కాస్త కనికరం
బిచ్చగాడికి దక్కేను అల్పాహరం

ఈడు వచ్చిన కొందరు కుర్రాళ్ళు
తోడు కోసం బోగీలన్నీ తిరిగేవాళ్ళు
ప్రేయసికి ఇచ్చినా పెద్ద బహుమతి
ప్రణయానికి వచ్చునా అనుమతి?

ఉసూరుమంటూ, ఊరూరూ ఆగుతూ
ఉరకలేసుకుంటూ,భారంగా ఊగుతూ
రయ్ మని పోయేది పాసింజరు రైలు
ఖయ్ మని కూసేది మా ఊరి రైలు

Thursday, March 4, 2010

అమెరికాలో మన ముత్యాలు

అమెరికాలో మన తెలుగు ముత్యాలు
పెంచుకోవడానికి కాస్త జీతభత్యాలు
ఎప్పుడైనా పలికినా కొన్ని అసత్యాలు
ఆఫీసు పనులే వారికి ప్రధాన కృత్యాలు
ఓపిగ్గా భరిస్తూనే బాసుల పైత్యాలు
చలాగ్గా సాధిస్తారు పనిలో ఆధిపత్యాలు

Wednesday, March 3, 2010

కల్కి

జాతినుద్ధరించటకు ఓ కల్కి
నీతివాక్యములెన్నో పల్కి
నిజము తెలుప మీడియా కెలికి
జనులు పడిరి ఉలికి ఉలికి

భక్తి ముసుగులో వ్యాపారం
వెకిలి చేష్టల వ్యవహారం
నకిలీ స్వాముల బండారం
కనులు తెరవాలి ఇకనైనా అందరం

Friday, February 26, 2010

నారదముని

ముల్లోకాలు తిరుగుతూ చెంగుచెంగుమని
శ్లోకాలు పాడుతూ ఖంగుఖంగుమని
అనుక్షణం తలిచేది శ్రీమన్నారాయణుని
ఏక్షణాన నిలిచేది ఎక్కడో నారదముని!

చిలికి చిలికి పలు వివాదాల్ని
చిలిపి తగాదాల మన కొంటెముని
తమాషాగా చేసే పనులు కొన్ని
హమేషా పరేషాన్ చేసేవి కొందర్ని

పేకాట పురాణం

పేకాటంటే ఎందరికో భలే మోజు
ఈఆటలో ఓడడం కొందరికి రివాజు
ప్లేసులు మారడం అర్ధంలేని క్రేజు
లాభం స్వల్పం,నువ్వు గెలిచిన రోజు

వినగానే ఈ విచిత్రపదం రమ్మి
లేచి కూర్చోదా పిరమిడ్లోని మమ్మి!
కాలక్షేపానికి తాతలు ఆడిన రమ్మీ
ఇంకా మనకేలనో ఈ ఆట చెప్మీ!

Friday, January 8, 2010

ద్వంద ప్రమాణాలు

రోజంతా టీవీలలో చెప్పెదరు చాడీలు
వారంతా పెట్టుబడిదారి కేడీలు
వెయ్యండి వాళ్ళ చేతులకి బేడీలు

తాను పాటించని నీతులు చెప్పే మీడియా
ప్రజాస్వామ్యానికి ఎంతో చేటయా
మన మేధావుల ద్వంద ప్రమాణాలు
సమాజానికి సలపరపెట్టే వ్రణాలు

బతుకు వెతలు

విధ్వంసానికి మనమంతా జతకడతాం
మన ఆస్థులు మనమే తగలెడతాం
ధరలు పెరిగాయని తెగతిడతాం
మన బతుకులింతేనని సరిపడతాం

ఉన్మాదంతో చేసేది ఉద్యమమే కాదు
హింసా మార్గానికి అంతమనేది లేదు
వ్యక్తులుగా మనం ఎదుగని నాడు
సమాజానికి పెరుగును కీడు

చక్కని ఇల్లు

ఎన్నో రోజులు వంచి ఒళ్ళు
ఇటిక ఇటిక పేర్చి వాళ్ళు
కట్టుకున్నారు ఎంచక్కని ఇల్లు

చిచ్చుపెట్టగా కొందరు నాయాళ్ళు
రెచ్చిపోయి ఒకరోజు వాళ్ళు
కూల్చుకున్నారు ఆచక్కని ఇల్లు